వర్ధన్నపేట, జూన్ 13 : నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయించాలని మున్సిపల్ పాలక మండలి, అధికారులకు కలెక్టర్ గోపి సూచించారు. 4వ విడుత పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం వర్ధన్నపేటలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రగతితో పాటు ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం పట్టణాలు, పల్లెల్లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చేపట్టిన పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగణం, వర్ధన్నపేట, డీసీతండ్లాలోని వైకుంఠధామాలు, పట్టణ సమీపంలోని మియావాకీని పరిశీలించారు.
వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ గోపి తనిఖీ చేశారు. దవాఖానలోని వార్డుల్లో తిరిగి రోగులను అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులు, వైద్యులు, సిబ్బందికి సంబంధించి హాజరు పట్టికను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది నిత్యం పేదలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
అలాగే, ప్రసవాల సంఖ్యను మరింతగా పెంచడంతో పాటు అన్ని విభాగాలకు సంబంధించిన ఓపీలు కూడా చూడాలన్నారు. విధులపై నిర్లక్ష్యం చేస్తే వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
పల్లెప్రగతిలో భాగంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ గోపి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పల్లెప్రగతి, మిషన్ భగీరథ పనులపై సంబంధిత అధికారులు, వివిధ మండలాల ఎంపీడీవోలతో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెప్రగతిలో భాగంగా దళితబంధు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వం అందించిన యూనిట్ల వినియోగం ఎలా ఉందో ఆరా తీయాలన్నారు. క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాల ఎంపిక వారంలోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని అన్ని డంపింగ్ యార్డులను వినియోగంలోకి తీసుకురావాలని, ఆదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీలు అంచనాలను మించి పనిచేస్తున్నాయని, అధికారులు కూడా అలాగే పని చేసి వారి జీపీలను ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వం అందించిన వాటర్ ట్యాంకర్ ద్వారా గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయం వచ్చేలా పనులు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భూక్యా హరిసింగ్, డీపీవో స్వరూపారాణి, డీఆర్డీవో సంపత్రావు, డీఎంహెచ్వో డాక్టర్ కే వెంకటరమణ, మిషన్ భగీరథ ఈఈ, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.