హనుమకొండ, జూన్ 13 : వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి పుల్లూరి సుధాకర్ సోమవారం వెల్లడించారు. అధ్యక్షుడిగా రెంటాల కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నడుముల విజయకుమార్ ఎన్నికయ్యారు. సామాజిక కార్యకర్త అధ్యక్షుడిగా ఎంపికకావడంపై అపార్ట్మెంట్ ఓనర్స్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిగా 34 సంవత్సరాలు పనిచేసిన కేశవరెడ్డి ఉద్యోగ సంఘంలో పలు పదవులు చేపట్టి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేశారు.
గెజిటెడ్ అధికారిగా ఉద్యోగ విరమణ చేసినప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కుష్ఠు, ఎయిడ్స్ బాధితులకు సేవలందించడంతో పాటు కరోనా సమయంలో పేదలు, వలస కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. అలాగే, తన మిత్రుల సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందారు. కరోనా సమయంలో చేసిన సేవలకు కరోనా వారియర్ అవార్డు పొందారు. కార్యవర్గం మొత్తం ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించిన అపార్ట్మెంట్ సభ్యులు, మిత్రులకు కేశవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అపార్ట్మెంట్ల సమస్యలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేశవరెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
అధ్యక్షుడిగా రెంటాల కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నడుముల విజయ్‌కుమార్, కోశాధికారిగ బీ సురేందర్జి, ఉపాధ్యక్షులుగా వీ కృపాకర్‌రావు, టీ మర్రిరెడ్డి ఎన్నికయ్యారు. అలాగే, సంయుక్త కార్యదర్శులుగా గుండ్ల శ్రీనివాస్, పాశికంటి రాజేంద్ర ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా కే అశోక్‌రెడ్డి, జీ రమణ, జీ వినయ్‌బాబు, కే మల్లారెడ్డి, జీ రాజ్‌కుమార్, బీ శ్రీలత, కే హన్మంతరెడ్డి, చిటిమల్ల కిషన్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.