బడిగంట మోగింది. రెండు నెలల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో స్కూళ్లల్లో సందడి వాతావరణం నెలకొన్నది. జిల్లాలోని పలు విద్యాలయాల్లో మొదటిరోజు స్కూల్కు వచ్చిన చిన్నారులకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పువ్వులు అందించి స్వాగతం పలికారు. దోస్తులను కలుసుకున్న ఆనందంలో చిన్నారులు కేరింతలు కొట్టారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంతోషాన్ని పంచుకున్నారు. కాగా, ఈ సంవత్సరం నుంచి అన్ని సర్కారు పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో బోధన ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి ప్రభుత్వ విద్యాలయాల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తెలిపారు.
గిర్మాజీపేట, జూన్ 13 : సోమవారం నుంచి 2022-23 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయని డీఈవో డీ వాసంతి తెలిపారు. జిల్లాలోని 663 ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కాగా, 3,045 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారన్నారు. మొత్తం ప్రభుత్వ పాఠశాలలోని 53,389 మంది విద్యార్థులకు తొలి రోజు 22,957 మంది హాజరయ్యారన్నారు.
దీంతో 43 శాతం హాజరు నమోదైందని వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల లో తొలిరోజు మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అమ లు చేశారు. ఈనెల 3 నుంచి 10 వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా 1987 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు ఆమె తెలిపారు. తొలిరోజు ప్రభుత్వ పాఠశాలలో 170 మంది విద్యార్థులు నూతనంగా అడ్మిషన్లు పొందారన్నా రు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు సమన్వయంతో పని చేస్తూ పాఠశాలల నూతన ప్రవేశాల సంఖ్య పెంచడానికి కృషి చేయాలని సూచించారు.
నర్సంపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలలు సోమవారం వడివడిగా ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగిసి దాదాపు రెండు నెలలు ఆటపాటలతో గడిపిన చిన్నారులు పాఠశాల బాట పట్టారు. మొదటి రోజు విద్యార్థులు వడి వడిగానే పాఠశాలలకు చేరుకున్నారు. దాదాపు 40 శాతం విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా కొనసాగాయి. పలు పాఠశాలల్లో అటెండర్లు, ఆయాలు లేకపోవడంతో విద్యార్థులే తరగతి గదులను శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది.
పలు పాఠశాలల్లో ఉదయం ఉపాధ్యాయులు సకాలంలో వచ్చినప్పటికీ విద్యార్థులు సక్రమంగా రాని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు పాఠశాలలు కూడా రెండు పూటలు కొనసాగాయి. మండలంలోని పలు పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారి రత్నమాల తనిఖీ చేశారు. పాఠశాలకు వచ్చిన పిల్లలకు మధ్యాహ్నా భోజన కార్మికులు భోజనాలు తయారు చేసి అందించారు. మొదటి రోజు పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బేసిక్స్ చెప్పారు.
పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు ఉత్సాహం చూపారు. నూతన విద్యాసంవత్సరంలో చిన్నారులను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు పాఠశాలలకు తీసుకొని వచ్చారు. చిన్నారుల కేరింతలతో పాఠశాలలు సందడిగా మారాయి.
నల్లబెల్లి: మొదటి రోజు ప్రభుత్వ పాఠశాలలకు 40 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ మేరకు ఎంఈవో చదువుల సత్యనారాయణ నందిగామ, నల్లబెల్లి, రంగాపూర్, లెంకపెల్లి, రేలకుంట పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులతో పాటు ఎస్ఎంసీ కమిటీ సభ్యులకు సూచించారు.
అలాగే ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నుంచి మొదటగా 9 పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు
గీసుగొండ: మండలంలో నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు పున ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉపాధ్యాయులు పాఠశాలలో అడ్మిషన్ నమోదు చేసుకున్నారు. మండలంలోని ఎలుకుర్తి ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను మొదటి రోజు ఎంపీపీ భమగాని సౌజన్య సందర్శించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ పిల్లలను దల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పంపి గ్రామాల్లో ఉండే పాఠశాలను కాపాడుకోవాలని అమె సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బాలకుమార్, ఉపాధ్యాయులు పాల్గాన్నారు.
పోచమ్మమైదాన్,: వరంగల్ 13వ డివిజన్ ఎల్బీ నగర్లోని ప్రభుత్వ మాసూం అలీ ఉన్నత పాఠశాలను డీఈవో వాసంతి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలు ప్రారంభం నేపథ్యంలో మాసూం అలీ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆమె సూచించారు.