వరంగల్, జూన్ 20 : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మె ల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ ఎ మ్మెల్యే కడియం శ్రీహరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషని, తాను మంత్రిగా ఉంటే తట్టుకోలేకపోతున్నాడని అన్నారు.
తన ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నాడని, అందుకే తన మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడని ఆరోపించారు. తరచూ సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వద్దకు వెళ్లి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. టీడీపీలో నడిపించినట్టు ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడని అన్నారు.
కానీ, ఇది కాంగ్రెస్ పార్టీ అని, ఇక్కడ అలాంటివి నడువదన్నారు. నాకు అదృష్టం ఉంది.. మంత్రిని అయ్యాను. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అవుతాడు. తరచూ నేను దిగిపోవాలని మాట్లాడడం సరికాదన్నారు. నా కూతురికి అదృష్టం లేదు.. ఎమ్మెల్యే కాలేదు. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయిందని అని మంత్రి కొండా సురేఖ మీడియా చిట్‌చాట్‌లో హాట్ కామెంట్ చేశారు.