నుమకొండ, జూలై 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలగించేలా వ్యవహరిస్తున్న మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్‌రావుపై చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానానికి సొంత ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. మంత్రి హోదాలో ఉంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన తీరు సరిగా లేదని, ఇలాంటి చర్యలతో పార్టీకి నష్టం కలుగుతున్నదని అన్నారు. కొండా దంపతులు ఒకటి రెండుసార్లు అన్నారంటే పొరపాటుగా జరిగిందని అనుకోవచ్చని, ఉద్దేశపూర్వకంగానే పదేపదే అంటున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వెళ్లారు. పీసీసీ క్రమశిక్షణ సంఘం ఆదేశాల మేరకు చైర్మన్ మల్లు రవిని కలిశారు. కొండా దంపతులపై గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన సమాచారాన్ని అందజేశారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ, మురళీధర్‌రావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలు, పేపర్ కటింగ్‌లు ఇచ్చారు. ఫిర్యాదులోని అంశాలపై వివరించాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం ఎమ్మెల్యేలకు సూచించగా, ఇప్పటికే చెప్పాల్సిందంతా చెప్పామని అన్నారు. అధికార యంత్రాంగాన్ని సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడంతో ప్రజల్లో పార్టీపై చులకన భావం ఏర్పడుతున్నదని చెప్పారు. బీసీ కార్డు వాడుకుంటూనే బీసీ, ఎస్సీ ప్రజాప్రతినిధులను కించపరిచే రీతిలో మాట్లాడుతున్నాడని అన్నారు. వ్యక్తి గతంగా తమపై చేసిన వ్యాఖ్యలతో పార్టీలో గ్రూపుల పరిస్థితి వచ్చి నష్టం జరిగేలా ఉన్నదని చెప్పారు.
మంత్రి సురేఖ, మురళితో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మధ్య పంచాయితీ ఎంతకీ ఆగడంలేదు. రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం కొనసాగుతున్నది. కొండా దంపతుల వ్యవహారశైలిపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి పీసీసీకి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు.
కొండా మురళి భారీ కాన్వాయ్‌తో గాంధీభవన్‌కు వెళ్లి ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసి బయటకు వచ్చిన తర్వాత మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలతోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై విమర్శలు, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్రెడ్డిపైనా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పీసీసీ క్రమశిక్షణ కమిటీ నచ్చజెప్పినా రెండు వర్గాల మధ్య పంచాయితీ అలాగే పెరుగుతున్నది. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, వివరణలతో కాంగ్రెస్‌లోని పంచాయితీకి ముగింపు పడే పరిస్థితి కనిపించడలేదు.