కరీమాబాద్, జూన్ 18: పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ సత్యశారద బుధవారం ఖిలావరంగల్ మండల పరిధిలోని ఖిలావరంగల్, కరీమాబాద్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. హాజరు పట్టికలు, రిజిస్టర్లు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి తగిన విధంగా బోధించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన సామూహిక అక్షరాభ్యాసంలో సత్యవతి పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మరుపల్ల రవి, బైరబోయిన ఉమ, డీఈవో జ్ఞానేశ్వర్, ఎంఈవో ప్రసాద్, హెచ్ఎం మాధవి, నాయకుడు అక్తర్ పాల్గొన్నారు.
ఖిలావరంగల్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒకరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో టాస్క్‌ఫోర్స్, యోగా దినోత్సవంపై వేర్వేరుగా సమీక్షించారు. పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్‌పై దృష్టి సారించాలన్నారు. ఇటుక బట్టీలు, బీడీల తయారీ, చిన్నతరహా పరిశ్రమలు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి బాలకార్మికులను గుర్తించాలన్నారు. హార్వెస్టింగ్ పనుల్లో తనిఖీలు చేయాలన్నారు. పిల్లలను పనుల్లో పెట్టుకుంటే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా లో చైల్డ్ లేబర్ విజిలెన్స్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలన్నా రు. అలాగే, ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ ఓసిటీ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ నారాయణస్వామి, డీఆర్డీవో కౌసల్యాదేవి, డీఈవో జ్ఞానేశ్వర్, డీవైఎస్వో సత్యవాణి, డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావు, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ పాల్గొన్నారు.