ధర్మసాగర్ : పాడి ఆవు, లేగదూడపై క్రూర జంతువు దాడి చేసిన ఘటన రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ఏగ్గని రవీందర్ అనే రైతుకు చెందిన పాడి ఆవు, లేగదూడను అటవీ జంతువు దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. రవీందర్ రోజువారిలానే శనివారం తన వ్యవసాయ క్షేత్రం వద్ద పాడి ఆవును, లేగ దూడను కట్టేసి వెళ్లారు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి పాడి ఆవు, లేగ దూడలు గాయపడి ఉండటం గమనించారు.
పరిశీలించి చూడగా పాడి ఆవు తొంటి భాగంలో, లేగ దూడ చెవులను కొరికి రక్తం పీల్చినట్లు రైతు గమనించారు. గతంలో కూడా ఈ చుట్టు పక్కల ప్రాంతంలో ఓ రైతుకు చెందిన బర్రెను అటవీ జంతువు దాడి చేసి చంపగా అటవీశాఖ అధికారులు వచ్చి హైనాగా గుర్తించారు. ఇప్పుడు కూడా పాడి ఆవు, లేగ దూడపై అదే జంతువు దాడికి పాల్పడినట్లు చుట్టుపక్కల రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, అటవీ జంతువు దాడిలో గాయపడిన పాడి ఆవు, లేగ దూడ సుమారు విలువ రూ.లక్ష వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు రవీందర్ కోరుతున్నారు. గత కొద్ది రోజుల వ్యవధిలోనే పాడి పశువుల పై క్రూర మృగాలు దాడి చేస్తుండటంతో సమీప రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి క్రూర మృగాలు వ్యవసాయ క్షేత్రాల వైపు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.