చెన్నారావుపేట : ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి ఉండ్రాతి సృజన్తేజ అన్నారు. మండలంలోని కోనాపురం, ఉప్పరపల్లి గ్రామాల హైస్కూళ్లు, అక్కల్చెడ, జోజిపేట ప్రాథమిక పాఠశాల, బాపునగర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలను పరిశీలించి పాఠశాలలోని పలు రికార్డులను, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపట్టికలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో కనీస అభ్యాసన సామర్ధ్యాలను విద్యార్థులకు వచ్చే విధంగా ‘త్రీఆర్స్’ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. మండలంలోని అన్ని హైస్కూళ్ల నుంచి ఇన్స్పైర్ అవార్డు కొరకు నామినేషన్లను రేపటి (22 వరకు) ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. వృత్యంతర నైపుణ్యం కొరకు ఎస్సీ ఈఆర్టీ వారు నిర్వహించే నిష్ఠ 2.ఓ కొరకు హైస్కూల్ ఉపాధ్యాయులు, నిష్ఠ 3.ఓ కొరకు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని ఈ నెల 25లోగా కోర్సు పూర్తి చేయాలన్నారు.
ఈ నెల 23వరకు నిర్వహించే కళాఉత్సవ్ కార్యక్రమంలో 9నుంచి 12వ తరగతి విద్యార్థులు పాల్గొనేలా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, కృష్ణమూర్తి, భాస్కర్, అనిత, రవిచంద్ర, వెంకటయ్య, సీఆర్పీలు సంపత్, స్వామి పాల్గొన్నారు.