హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 30: తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. బుక్‌స్టాళ్లు, గ్రంథాలయాలు ఉద్యోగార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రిపరేషన్ కోసం కొత్త పుస్తకాలను కొనలేనివారు సెకండ్ హ్యాండ్ పుస్తకాలవైపు మొగ్గు చూపుతున్నారు. చరిత్ర నుంచి మొదలు టెక్నాలజీ బుక్స్ కూడా అందుబాటులో ఉండడంతో పలు బుక్‌స్టాళ్లు కిటకిటలాడుతున్నాయి. తక్కువ ధరకే దొరుకుతుండడంతో ఎక్కువమంది వీటినే కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి నగరానికి వచ్చిమరీ తమకు కావాల్సిన పుస్తకాలను కొనుక్కెళ్తున్నారు. ఇంటర్, డిగ్రీ పుస్తకాలను ఎక్కువగా కొంటున్నారు. గ్రూప్స్-1, 2, 3, 4, డీఎస్సీ, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన పుస్తకాలను కొనలేనివారికి సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఎంతో మేలు కలిగిస్తున్నాయి.
అన్నీ అందుబాటులో..
తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లు రాగానే అభ్యర్థులు అధిక సంఖ్యలో వస్తున్నారు. విక్రయదారులతో బుక్‌స్టాల్ సందడిగా మారింది. ఎక్కడా లభించని పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కొత్త, పాత పుస్తకాలు ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు గిరాకీ బాగుంది. కొత్తవి కొనలేనివారు పాతవి కొంటున్నారు.
-మహమ్మద్ జుబేర్
ఇవే బెటర్
సీఎం కేసీఆర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో అందరూ పుస్తకాలు కొంటున్నారు. కొత్తవి కొనలేనివారు సెకండ్ హ్యాండ్‌వి తీసుకుంటున్నారు. ఆర్థికంగా స్తోమత లేనివారికి సెకండ్ హ్యాండ్ బుక్స్‌తో చాలా ఉపశమనంగా ఉంటుంది. ఎక్కుడ డబ్బు పెట్టి కొత్తవి కొనేకంటే తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్ బుక్స్ కొంటేనే బెటర్..
– అజ్మీరా ఝాన్సీ
అన్నీ ఉన్నయ్
నేను డిగ్రీ చదువుతున్న. మా అక్క కోసం పుస్తకాలు కొంటున్న. ఇక్కడ అన్ని పుస్తకాలూ ఉన్నయ్. సెకండ్ హ్యాండ్లో లేకుంటే కొత్తవి కొంటున్నం. సెకండ్ హ్యాండ్ కొంటే మనీ సేఫ్.
– చందు, గోవిందరావుపేట
లైబ్రరీలో చదువుతున్నా
మాది ఆదిలాబాద్ జిల్లా. గ్రూప్-2 కోసం ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడే ఉండి కోచింగ్ తీసుకుంటున్నా. లైబ్రరీలో చదవడంతో పాటు సెకండ్ హ్యాండ్ బుక్స్ తీసుకున్నా. అన్ని అకాడమీల పుస్తకాలు ఉన్నాయి.
– ధర్మయ్య, ఆదిలాబాద్