కరీమాబాద్ : మనం నివసించే ఇంటితో పాటు మనం పని చేసే కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి అన్నారు. ఆదివారం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న చెత్తాచెదారాన్ని అధికారులతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అన్నారు. అధికారులు, సిబ్బంది చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయద్దన్నారు. చెత్త బుట్టలోనే చెత్త వేయాలన్నారు. వాహనాలను క్రమ పద్దతిలో నిలపాలన్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది కలసికట్టుగా కార్యాలయాలను ప్రతి రోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
కార్యాలయాలు, ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చొరవ చూపాలన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు సైతం అవగాహన కల్పించాలన్నారు. చెత్తా చెదారంతో నిండిన ఆవరణను పరిశుభ్రంగా మార్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
నేడు గ్రీవెన్స్..
నేటి నుంచి ప్రతి సోమవారం యధావిదిగా జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ గోపి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు సమస్యలపై ఇచ్చే వినతులను తీసుకుని వాటిని పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు.