హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 9: కేంద్ర ప్రభు త్వం బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సర్వీసులను వెంటనే ప్రారంభించాలని ఆ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ సహాయ ప్రధాన కార్యదర్శి జూలపల్లి సంపత్ రావు డిమాండ్ చేశారు. శనివారం బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ 10వ అఖిలభారత మహాసభలు అస్సాం రాజధాని గౌహతిలో ఈనెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఘనంగా జరిగాయని తెలిపారు. దేశ నలుమూలల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరై బీఎస్ఎన్ఎల్ పరిరక్షణ, బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సర్వీసులను ప్రారంభించేందుకు ఆటంకాలను కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై వక్తలు ప్రసంగించారని చెప్పారు.
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు 2017 జనవరి 1 నుంచి మూడో వేతన సవరణ అమలు చేయకపోగా, పెన్షనర్లకు పెన్షను సవరణ అమలు చేయలేదని, కరోనా సమయంలో ఫీడ్ చేసిన డీఏను కేరళ హైకోర్టు తీర్పు ప్రకారం అమలు చేసి డీఏ ఏరియర్స్‌ను చెల్లించాలని డిమాండ్ చేసినట్లు వివరించారు. మూడేళ్లకు 25 మందితో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అందులో తెలంగాణ నుంచి తనను సహాయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంపత్‌రావు తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాస్, ఆలిండియా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పి.సంజీవ్, క్యాజువల్ కాంట్రాక్ట్ వరర్స్ ఫెడరేషన్ నుంచి సీహెచ్ సతీష్‌బాబు, మోహన్‌బాబు, ఆంజనేయులు, గురుమూర్తి, వీర రాఘవయ్య, ధర్మారావు, రాజగోపాల్, రమణారెడ్డి, రమేష్, నరసింహారెడ్డి పాల్గొన్నారు.