హనుమకొండ : వారసత్వ భూమిలో వాటా విషయమై దాయాదుల మధ్య వివాదం రాజుకుంది. తమకు రావాల్సిన వాటాను కూడా తమకు తెలియకుండా తమ దాయాది తుటిక శ్రీనివాస్ పట్టా చేయించుకున్నాడని తుటిక శ్రీకాంత్, అతడి తల్లి రాజేశ్వరి పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు ఈ సివిల్ తగాదాను పెద్ద సమక్షంలోగానీ, కోర్టులోగానీ పరిష్కరించుకోవాలని సూచించారు. పెద్ద మనుషులు చెప్పినా శ్రీనివాస్ పట్టించుకోకపోవడంతో బాధితులు విలేకరుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. తమకు వారసత్వంగా రావాల్సిన వ్యవసాయ భూమిని తుటిక శ్రీనివాస్ అనే వ్యక్తి తన పేరు మీద, తన సోదరీమణుల పేరు మీద పట్టా చేయించుకున్నాడని బాధితులు తుటిక శ్రీకాంత్, రాజేశ్వరిలు తెలిపారు. శనివారం మండలంలోని శాలపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. శాలపల్లి గ్రామానికి చెందిన తుటిక మల్లమ్మ అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు అనారోగ్యంతో గతంలోనే చనిపోయాడు.
అయితే మల్లమ్మ పేరు మీద 1.20 గుంటల వ్యవసాయ భూమి ఉండగా చిన్న కుమారుడు శ్రీకాంత్.. మల్లమ్మకు తాను ఒక్కడినే కొడుకునని చెప్పి ఆమె పేరు మీద ఉన్న భూమిని తన పేరుమీదికి, తన సోదరీమణుల పేరు మీదికి మార్చుకున్నాడు. విషయం తెలుసుకున్న పెద్ద కోడలు తుటిక రాజేశ్వరి ఆమె కుమారుడు తుటిక శ్రీకాంత్.. శ్రీనివాస్‌పై కేసు పెట్టారు. దాంతో సివిల్ తగాదాను పెద్ద మనుషుల సమక్షంలో లేదా కోర్టులో తేల్చుకోవాలని సూచించారు.
దాంతో తుటిక రాజేశ్వరి, తుటిక శ్రీకాంత్ శాలపల్లి గ్రామంలో పెద్ద మనుషులను కలిసి పంచాయతీ పెట్టారు. పెద్దమనుషులు భూమిని ఇద్దరు అన్నదమ్ములు సమానంగా పట్టా చేసుకోవాలని తీర్మానించారు. అందుకు తుటిక శ్రీనివాస్ కూడా ఒప్పుకుని సంతకాలు చేశాడు. కానీ తుటిక శ్రీకాంత్‌కు పట్టా చేయకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. దాంతో బాధితులు మళ్ళీ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు.
దాంతో వృద్ధురాలు తుటిక మల్లమ్మ సంరక్షణ కోసం చెరో లక్ష డిపాజిట్ చేయాలని పెద్దలు మనుషులు ఇరువర్గాలను ఒప్పించారు. ఇద్దరూ చెరో రూ.లక్ష చొప్పున రూ.2 లక్షలు పెద్ద మనుషుల వద్ద పెట్టారు. ఈ క్రమంలో తుటిక శ్రీనివాస్ పెద్ద మనిషుల్లో ఒకరైన కూరపాటి అశోక్‌పై తాజాగా ఆరోపణలు చేశారు. అతనిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. భూమిని బాధితుల పేరు మీదకు మార్చకుండా జాప్యం చేస్తున్నాడు. దాంతో తమకు తమ వాటా భూమిని ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
అన్నదమ్ముల భూమి పంచాయతీలో పెద్ద మనిషిగా న్యాయం చేయడం కోసమే తీర్మానం చేసిన తనపై తుటిక శ్రీనివాస్ కక్ష్యపురితంగా వ్యవహరిస్తున్నాడని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని పెద్ద మనషి కూరపాటి అశోక్ చెప్పారు. శ్రీకాంత్‌కు భూమిని పట్టా చేయాలని పెద్ద మనుషులతో తీర్మానం చేయించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు.