హనుమకొండ చౌరస్తా, జూన్ 13: పద్మశ్రీ మందకృష్ణ మాదిగను ఘనంగా సన్మానించనున్నట్లు వీహెచ్పీఎస్ (VHPS) జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డ కాళీం తెలిపారు. ఈనెల 19న హైదరాబాద్లో సన్మాన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్న మంద కృష్ణ మాదిగను ఘనంగా సన్మానించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
వికలాంగుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన తమ నాయకుడిగా, సమాజంలో వారికి గుర్తింపు, గౌరవాన్ని సాధించిపెట్టిన నేతగా, తమ జీవితాల్లో పెన్షన్లను పెంచి గౌరవంగా జీవించే స్థితికి తీసుకొచ్చిన మహాశయుడుగా మంద కృష్ణను గౌరవిస్తూ పద్మశ్రీ పొందిన సందర్భంగా ఎంతో అభిమానంతో సన్మానం చేయనున్నట్లు తెలిపారు. సన్మాన సభకు పెద్ద ఎత్తున వికలాంగులను తరలించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు బొట్ల సురేష్, గుమ్మాడి రాజు, మాటల సురేష్, వీరస్వామి, రాకేష్, శ్రీనివాస్, ప్రభాకర్, సదానందం, రవి, యాకయ్య పాల్గొన్నారు.