హనుమకొండ చౌరస్తా, జూలై 31: విద్యార్థులను భవిష్యత్ సాంకేతికతలకు సిద్ధం చేయాలి అని ప్రొఫెసర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆధ్వర్యంలో రాష్ర్టస్థాయి అధ్యాపక శిక్షణ కార్యక్రమం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం శుక్రవారం నిర్వహించారు. రాష్ర్టంలోని జూనియర్ కళాశాలల నుంచి ఎంపికైన మాస్టర్ ట్రైనర్లకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం భౌతికశాస్త్రం సవరించిన పాఠ్యప్రణాళిక, సిలబస్ అమలుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగ ప్రొఫెసర్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ బి.వెంకట్రామిరెడ్డి ‘ఫిజిక్స్ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్’ అనే అంశంపై ప్రధాన ఉపన్యాసం అందించారు. ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్రంగాల్లో భౌతికశాస్త్రం పాత్ర, భవిష్యత్ ఉపాధి అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇటీవల సవరించి ప్రచురించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం భౌతికశాస్త్ర పాఠ్యపుస్తకానికి సంపాదకుడిగా వ్యవహరించిన ప్రొఫెసర్ వెంకట్రామిరెడ్డి సిలబస్ రూపకల్పనలో ఆధునిక సాంకేతిక అంశాలను సమన్వయం చేసిన విధానాన్ని ఉపాధ్యాయులకు వివరించారు. ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు సమన్వయం చేసిన ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ర్టవ్యాప్తంగా జూనియర్ కాలేజీల అధ్యాపకులు పాల్గొన్నారు.