మడికొండ: తెలంగాణ జర్నలిస్టుల దిక్సూచి అల్లం నారాయణ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పురుడు పోసుకున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలను జయప్రదం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్(హెచ్143) హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మస్కపురి సుధాకర్, అర్షం రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు కాజీపేట మీడియా పాయింట్లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భవించి మే 31వ తేదీతో 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్‌లో నిర్వహించనున్న సంబురాలకు జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు.
తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో 2001 మే 31న ఆవిర్భవించిన ఈ ఫోరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు అన్ని వర్గాల ప్రజలను, ఉద్యమ సంఘాలను సంఘటితం చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బత్తిని రాజేందర్, అలువాల నరేందర్, కట్కూరి రవికుమార్, కొలిపాక కుమారస్వామి, ఆదర్శ్, వెంకట్ స్వామి, శ్యామ్, బుర్ర శ్రీనివాస్, షకీర్, కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.