మహదేవపూర్ (కాళేశ్వరం), ఆగస్టు 10 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన లక్ష్మి(మేడిగడ్డ)బరాజ్‌కు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. 16.17టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన బరాజ్‌కు శనివారం ఇన్ ఫ్లో 75,550 క్యూసెక్లు రాగా, ఆదివారం 90,330క్యూసెకులకు పెరిగింది.
మొత్తం 85గేట్లు ఎత్తి అంతేమొత్తంలో ప్రవాహాన్ని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుంచి సముద్రమట్టానికి 90.10 మీటర్ల ఎత్తులో ఉందని, మరింత పెరిగే అవకాశం ఉందని భారీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కాళేశ్వరంలో గోదావరి నది నిలకడగా ప్రవహిస్తున్నది.