హనుమకొండ చౌరస్తా, మార్చి 23: చారిత్రక రుద్రేశ్వరాలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు 5వ రోజు సోమవారం అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలం మధ్య నిర్వహించారు. భక్తులందరూ శ్రీరామ జయ రామ అంటూ జయ జయ ధ్వనులతో ఆలయం మారుమోగుతుండగా స్వామివార్లకు పూజాధి కార్యక్రమాలు నిర్వర్తించి మర్యాద పురుషోత్తముడిగా అలంకరించి చిత్రాన్న నైవేద్యం నిరాజన మంత్రపుష్పం సమర్పించారు.
అనంతరం యాగశాలలో నవగ్రహ అష్టదిక్పాలక వైకుంఠపారిషద హోమం, సుదర్శన హోమం లోకకళ్యాణార్థం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రడం కృష్ణమూర్తి-శ్రీదేవి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్ పర్యవేక్షణలో వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేందర్‌శర్మ, చెరుకుపల్లి శ్రీవాత్సవచార్యులు, మణికంఠశర్మ అవధాని, ప్రణవ్, సందీప్‌శర్మ నిర్వహించారు.