భీమదేవరపల్లి, అక్టోబర్ 27: సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారి విస్తరణ నిర్మాణ పనులు (Road Works) అసంపూర్తిగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు తమ ఇష్టారీతిన పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో భాగంగా కొందరివి ఇంటి పైకప్పు ముందు భాగం ధ్వంసం చేసి, మరికొందరివి వదిలేశారని ప్రజలు మండిపడుతున్నారు. ముల్కనూరు ప్రయాణ ప్రాంగణం వద్ద ఇటీవలే సైడ్ డ్రైనేజీ నిర్మించారు. సరిపడేంత మొరం పోయకపోవడంతో సిద్దిపేట నుంచి హనుమకొండకు వెళ్తున్న వరంగల్ వన్ డిపోకు చెందిన బస్సు (RTC Bus) డ్రైనేజీకి తగలడంతో ధ్వంసమైంది.
ఒక్కసారిగా శబ్దం రావడంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు పెద్దగా కేకలు వేశారు. బస్సు ముందు భాగంలో టైర్, ఫుట్ పాత్ పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఉన్న ప్రయాణీకులను ఆర్టీసీ సిబ్బంది మరో బస్సులోకి ఎక్కించి పంపించారు. ఇదిలా ఉంటే సైడ్ డ్రైనేజీ పనులు మాత్రమే కాంట్రాక్టర్ చేస్తాడని, ఆర్టీసీ వాళ్ళే బస్టాండ్‌లోకి బస్సులు వచ్చేలా ఎత్తుగా మొరం పోసుకోవాలని అక్కడికి వచ్చిన ప్రజలు మాట్లాడుకోవడం కొసమెరుపు.