Professor Mallaram Aruna : హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 4: హనుమకొండలోని పింగళి ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీ రసాయనశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ మల్లారం అరుణ (Mallaram Aruna) ‘రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలి’గా ఎంపికయ్యారు. జూనియర్ లెక్చరర్ నుంచి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన ఆమె.. 23 సంవత్సరాల నుంచి విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. విద్యారంగంలో అరుణ అందించిన విశేష సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. విద్యా బోధనలోనే కాకుండా పరిశోధనల పరంగానూ ప్రతిభ చూపించిన అరుణ ఉద్యోగ ప్రస్థానం 2002లో మొదలైంది.
కరీంనగర్ కేంద్రంలో అరుణ ప్రాథమిక, ఇంటర్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ (రసాయన శాస్త్రం) చదివిన ఆమె పీహెచ్డీ పట్టా అందుకున్నారు. 2002లో జూనియర్ లెక్చరర్‌గా ఎంపికవ్వడంతో ఉపాధ్యాయురాలిగా ఆమె కెరీర్ మొదలైంది. 2010 పదోన్నతి పొందిన ఆమె మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా.. ఆపై పరకాల డిగ్రీ కాలేజీలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం అరుణ పింగిలి ప్రభుత్వ మహిళా కాలేజీలో రసాయన శాస్త్ర విభాగాధిపతిగా ఉన్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందిన అరుణను ప్రిన్సిపాల్ ఆచార్య బి.చంద్రమౌళి, ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులు అభినందించారు.
ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ అంతర్జాతీయ, జాతీయ పరిశోధన జర్నల్‌లో 25 పరిశోధన పత్రాలు సమర్పించారు అరుణ. ఆమె పర్యవేక్షణలో కాలేజీ కమిషనరేట్ హైదరాబాద్ నిర్వహించిన రాష్ర్టస్థాయి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ పోటీలలో మొదటి బహుమతి సాధించింది. రసాయన శాస్త్రంలో రెండు జాతీయస్థాయి సెమినార్లను నిర్వహించారు. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, కల్యాణి పబ్లికేషన్స్, మీరట్ పబ్లికేషన్స్‌లలో విద్యార్థుల కోసం 10 రసాయనశాస్త్ర పాఠ్యపుస్తకాలను రచించారు అరుణ.
టీసాట్ నిపుణ విద్యాఛానల్ ద్వారా విద్యార్థుల కోసం 12 ప్రత్యక్ష ఉపన్యాసాలను అందించారీ ప్రొఫెసర్. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌గా, అకాడమిక్ కోఆర్డినేటర్‌గా, మహిళా సాధికారిక విభాగం కన్వీనర్‌గా కాలేజీలో విస్తృత సేవలందించారామె. అంతేకాదు సామజిక సేవలోనూ ముందుంటారు అరుణ. కాకతీయ ప్రభుత్వ కాలేజీలో వివిధ జిల్లాలలకు చెందిన విద్యార్థులకు 2014 నుంచి 2025 వరకు ఎమ్మెస్సీ రసాయన శాస్త్ర ప్రవేశ పరీక్ష కోసం 40 రోజుల ఉచిత కోచింగ్ ఇచ్చారు. ఆమె కోచింగ్ ఫలితంగా పలువురు విద్యార్థులు వివిధ కేంద్ర, రాష్ర్ట విశ్వవిద్యాలయాల్లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో సీట్లు సాధించారు.