కరీమాబాద్, డిసెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందిస్తున్నది. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా విద్యార్థులు ఫలితాలు సాధిస్తున్నారు. అలాగే, సర్కారు ప్రోత్సాహంతో విద్యార్థులు క్రీడల్లోనూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ పోటీల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బాలికలు నిత్యం కసరత్తు చేస్తున్నారు. వేకువజామున చలిలో, రాత్రిపూట హైమాస్ట్ లైట్ల వెలుతురులో సాధన చేస్తున్నారు. ఉదయం 6 నుంచి రాష్ట్ర 8.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు గెలుపే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించేకునేలా కఠోర సాధన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి జరుగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ సబ్ జూనియర్ బాలికల పోటీలకు ఎంపికైన బాలికలు వరంగల్ దసరా రోడ్డులోని మున్నూరుకాపు సంఘం భవనంలో విడిది చేస్తూ వారం రోజులపాటు కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని కోచింగ్ క్యాంపులో మెళకువలు నేర్చుకుంటున్నారు. బాలికల శిక్షణ కోసం ఉన్నత పాఠశాలలో కబడ్డీ కోర్టును సైతం ఏర్పాటు చేశారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఎంపికయ్యారు. మహేశ్వరి(కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల), చందన(వంచనగిరి), అమూల్య(జడ్పీహెచ్ఎస్ కొంకపాక), శ్రుతి(కేజీబీవీ నల్లబెల్లి), వైష్ణవి(వంచనగిరి), కార్తీక(కరీమాబాద్ ఉన్నత పాఠశాల), అఖిల(రంగశాయిపేట ఉన్నత పాఠశాల), రేవతి(కరీమాబాద్ ఉన్నత పాఠశాల), సుష్మిత(వంచనగిరి), సంజన (కరీమాబాద్ ఉన్నత పాఠశాల), శ్రీజ(ఎంజేపీ నెక్కొండ) సుగంది(కరీమాబాద్ ఉన్నత పాఠశాల), కావ్య (రంగశాయిపేట ఉన్నత పాఠశాల), విందు(కేజీబీవీ నెక్కొండ), దమయంతి (జల్లి), చందన (కేజీబీవీ నల్లబెల్లి), అఖిల(జడ్పీహెచ్ఎస్ మొండ్రాయి), అమూల్య, కీర్తన, విజయ (కొంకపాక) ఎంపికయ్యారు.
అందరి సహకారంతో శిక్షణ
తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి జరుగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ సబ్ జూనియర్ బాలికల పోటీలకు ఎంపికైన బాలికలకు జిల్లా అసోసియేషన్ తరఫున పలువురు కోచ్ల సహకారంతో ఉదయం, సాయంత్రం కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శిక్షణ ఇస్తున్నాం. పిల్లలు బస చేసేందుకు మున్నూరుకాపు సంఘం నాయకులు భవనం ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించేందుకు కృషి చేస్తాం. మెళకువలు చెబుతూ బాలికలను పోటీలకు అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నాం.
– అక్తర్, కబడ్డీ అసోసియేషన్ వరంగల్ జోన్ సెక్రటరీ