కొడిమ్యాల, జనవరి 23 : జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో అర్చకులు ధర్నాకు దిగారు. ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ఈవో శ్రీకాంతరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా ఆంధ్రా నుంచి వచ్చిన అభిమానులకు ప్రత్యేక దర్శనం చేయించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆలయ అధికారులు, అర్చకులకు ఫోన్లో సూచించారు. శుక్రవారం ఆంధ్రా నుంచి వచ్చిన టీడీపీకి చెందిన ఇద్దరు అభిమానులు, స్థానిక నాయకులు 30 మందితో కలిసి గర్భగుడిలో పూజలు చేస్తున్నారు. ఈవో శ్రీకాంతరావు ఆలయంలోకి వచ్చి ‘ఇంత మందిని ఎవరు అనుమతించారు అని అర్చకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
అందరినీ సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో అర్చకులు, ఈవోకు మధ్య వాగ్వా దం జరిగింది. అర్చకులు అలయం ఎదు ట బైఠాయించి ఈవోకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఎమ్మెల్యే సత్యం అర్చకులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ప్రొటోకాల్ విధులు నిర్వర్తించే ఆలయ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంతోనే సమస్య తలెత్తినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై ఈవో శ్రీకాంతరావును వివరణ కోరగా, భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన డబ్బులను హుండీలో వేయకుండా అర్చకులు సొంతానికి వాడుకుంటున్నారని, సమయపాలన పాటించకుండా ఇష్టం వచ్చిన టైంలో ఆలయానికి వస్తున్నారని, ఈ రెండు కారణాలపై నోటీసులు జారీచేయగా కక్ష పూరితంగా ధర్నాకు దిగారని వెల్లడించారు.