హనుమకొండ చౌరస్తా, మే 20 : గ్రేటర్ మున్సిపల్ పరిధిలోని పైడిపల్లి 3వ డివిజన్ శ్రీరాఘవేంద్ర నగర్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కాలనీ అధ్యక్షుడు పిన్నింటి ప్రకాష్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 రోడ్లు కలిగిన ఈ కాలనీలో కేవలం రోడ్ నెం-2 మాత్రమే సీపీ రోడ్డు వేశారన్నారు.
డ్రైనేజీ లేకపోవడంతో ఇళ్లలో నీరు రోడ్లపై చేరి మురికి గుంటలుగా ఏర్పడి దోమలతోపాటు ఇతర కీటకాలు గుంటలలో చేరి కాలనీ వాసులు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు. మిగిలిన 9 రోడ్లు వర్షాకాలంలో లోతట్టు ప్రాంతం కావడంతో గుంటల్లో నీళ్లు చేరి వాహనదారులతోపాటు పాదాచారులకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ సమావేశంలో కాలనీ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి చిరంజీవి, ఆంజనేయులు, తిరువూరు దేవిప్రసాద్, రాయబారపు రాములు, శాతరాజు నర్సింగరావు, శ్రీరామోజు మహేందర్ పాల్గొన్నారు.