హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 3: వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా కాలేజీ(అటానమస్) అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు రాజు ‘రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడి’గా ఎంపికయ్యారు. యూట్యూబ్ చానెల్ ద్వారా.. విద్యార్థులకు కామర్స్ పాఠాలు సులువుగా అర్ధమయ్యేలా కృషి చేస్తున్న ఆయనకు ఈ గౌరవం దక్కడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. 2013లో అధ్యాపకుడిగా కెరీర్ మొదలెట్టిన ఆయన అప్పటి నుంచి ప్రభుత్వ కళాశాలలో విశేష సేవలందిస్తున్నారు.
కామర్స్ అధ్యాపకుడైన గుగులోతు రాజు.. బోధనా బాధ్యతలతో పాటు కళాశాల అకడమిక్, పరిపాలనా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దశాబ్ద కాలంగా విద్యా బోధనలో ఆయన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది రాష్ట్రస్థాయిలో ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారాయన. దాంతో పింగిళి కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బత్తిని చంద్రమౌళి, అధ్యాపకులు రాజుకు అభినందనలు తెలిపారు. ఈనెల 5న కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకోనున్నారు.
కష్టంగా అనిపించే కామర్స్సబ్జెక్టును విద్యార్థులకు సులభమైన పద్ధతుల్లో భోధిస్తున్నారు రాజు. అందుకోసం ఐసీటీ టూల్స్, డిజిటల్ లెర్నింగ్, ఆన్ లైన్ వంటి బోధనా విధానాలను ఆయన విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులకు తరగతి గది బోధనతో పాటు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రాజు ‘జీఆర్ఎం’ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. కామర్స్కు సంబంధించిన వివిధ అంశాలు, పాఠ్యాంశాలు, పరీక్షల ప్రిపరేషన్, ఐసీటీ టూల్స్ వినియోగం, విద్యార్థుల సందేహాల నివృత్తి తదితర అంశాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా విద్యార్థులకు అందిస్తున్నారు. అలాగే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్అందిస్తూ ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు, భవిష్యత్ కెరీర్ ఎంపికలపై అవగాహన కల్పిస్తున్నారీ అసోసియేట్ ప్రొఫెసర్.