హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 10: మెడికల్ సీట్ల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకువచ్చిన 33 జీవోని అమలు చేయకపోవడంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. శుక్రవారం హనుమకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మతివనం(ఏకశిల పార్కు)లో నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణాచారి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో చదవకపోయినా చదివినట్లు తప్పుడు స్టడీ సర్టిఫికేట్లు పెట్టి తెలంగాణలో మెడికల్ అడ్మిషన్స్ తీసుకుంటున్నారని, 33 జీవోను ప్రభుత్వం తీసుకువచ్చిందని దీన్ని అమలు చేయకపోవడంతో అన్యాయం జరిగిందన్నారు.
కోర్టుకు వచ్చిన అందరినీ నీట్-యూజీ-2024 కౌన్సెలింగ్‌కి అనుమతిస్తామని మిగిలినవారికి జీవో 33ని వర్తింపజేస్తామని చెప్పి అడ్మిషన్స్ ప్రక్రియను కొనసాగించారని తెలిపారు. 135 మంది కోర్టుకు వెళ్లగా 86 మందికి లోకల్‌గా పరిగణించారని, ఇందులో 56 మంది తెలంగాణకు సంబంధంలేనివారు ఉన్నారు. తెలంగాణ విద్యార్థులు ఒక్క సీటు కూడా వదులుకోవద్దని, విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో చదివినవారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగింది.
అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన 33 జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులు బి.అంజయ్య, ఆర్.మధు, మహేష్, భరత్, ఆర్.నరేందర్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రెడ్డి జి.అనిల్‌కుమార్, జి.ప్రసాద్‌చారి, వీటీవీ రామారావు, ఎన్.విష్ణు, టి.ఉమేష్‌కుమార్, ఎస్.భాస్కర్‌రావు, ఈ.కృష్ణకుమార్, టి.రాంప్రసాద్, జీఎస్ హనుమంతరావు, ఈ.ఓంప్రకాశ్, బి.హరీందర్, డి.సంధ్య పాల్గొన్నారు.