హనుమకొండ చౌరస్తా : నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తెచ్చిన తర్వాతనే ఓట్లు అడుగుతామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎయిర్పోర్ట్(Mamunuru airport) అంశంపై డీసీసీ భవన్లో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కే ఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎయిర్పోర్ట్పై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం మానుకోవాలన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏం చెప్పాలో తెలీక కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడును తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాడని ఎద్దేవా చేశారు. దద్దమ్మ లాగా ఇన్ని రోజులు తిని కూర్చున్నది కిషన్ రెడ్డి కాదా? అని ఘాటుగా విమర్శించారు. జీఎంఆర్ తో 150 కిలోమీటర్ల పరిధి ఒప్పందం ఉన్నపుడు ఇన్నేళ్లు ఎందుకు వాళ్లను ఒప్పించలేదన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. మతాలను రెచ్చగొట్టి కాంగ్రెస్ను పాకిస్తాన్ తో పోల్చారు. ఇక్కడి ముస్లింలు భారతీయులు కారా? అని సూటిగా ప్రశ్నించారు.ముస్లింలపై మీ వైఖరి ఏంటో తెలుస్తుందన్నారు.