మహబూబాబాద్ రూరల్, జనవరి 20 : ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి కవిత మాట్లాడారు. సింగరేణి బొగ్గు గనుల టెండర్లలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావును కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్న హరీశ్‌రావుపై మళ్లీ ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకొచ్చిందన్నారు.
గతంలోనే ఈ కేసును కోర్టు కొట్టి వేసిందని, కావాలనే రేవంత్‌రెడ్డి కేసులు పెట్టిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులపై, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి, విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు చేసినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటం చేస్తారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.