ఖిలా వరంగల్, మార్చి 09 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీల్లో ఖిలా వరంగల్ మండలంలోని మధ్య కోట ప్రభుత్వ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. బాక్సింగ్, వుషూ విభాగాల్లో జిల్లా , రాష్ట్ర స్థాయిల్లో మొత్తం 15 మంది విద్యార్థులు పతకాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో శృతిక, పూజ, రితిక, శాలిని, కీర్తన, లాస్య, తులసి, వివేక్, ప్రణయత్, నరసింహారాజు, గణేష్‌లు పతకాలు సాధించారు.
వుషూ విభాగం జిల్లా స్థాయి పోటీల్లో శృతిక, శాలిని, సాహిత్య, వివేక్‌లు విజేతలుగా నిలిచారు.
రాష్ట్ర స్థాయి సీఎం కప్ వుషూ పోటీల్లో శృతిక, శాలిని, వివేక్‌లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం విశేషం. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 38వ డివిజన్ కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ మాట్లాడుతూ మిడిల్ ఫోర్ట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి పాఠశాల ఖ్యాతిని పెంచడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, వారికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు.