వేలేరు: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై వేలేరు మండల బీఆర్ఎస్ నాయకుడు కొయ్యడ మహేందర్ తీవ్రంగా ఖండించారు. పేదల సంక్షేమానికి సంబంధించిన అత్యంత కీలకమైన పథకంపై ప్రభుత్వం కోర్టులో సరైన సమయంలో కౌంటర్ దాఖలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన కల్యాణలక్ష్మి పథకం పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచిందని మహేందర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ పథకం కింద సాధారణ లబ్ధిదారులకు రూ.1,00,116, వరకు ఆర్థిక సాయం అందుతోంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లో ప్రభుత్వం తన వాదనను సమర్థవంతంగా వినిపించాల్సి ఉండగా, కౌంటర్ దాఖలులో జాప్యం చేయడం వల్లే కోర్టు స్టే విధించే పరిస్థితి వచ్చిందని మహేందర్ ఆరోపించారు. పేద కుటుంబాల్లో పెళ్లిళ్లు చేసుకునే వారికి ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, వాటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రభుత్వం వెంటనే కోర్టులో సమర్థవంతమైన వాదనలు వినిపించి స్టే ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి కల్యాణలక్ష్మి సాయం అందించాలని కొయ్యడ మహేందర్ డిమాండ్ చేశారు. పేదల సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా కొనసాగించాలని ఆయన కోరారు.