భీమదేవరపల్లి, ఏప్రిల్ 12: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామంలో శనివారం రాత్రి హనుమాన్ శోభాయాత్ర (Hanuman Shobha Yatra) కన్నుల పండువగా జరిగింది. గ్రామంలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో సుమారు 10 ఫీట్ల హనుమాన్ విగ్రహంతో వీధుల్లో ర్యాలీ నిర్వహించగా పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. ఇంటింటా మహిళలు కొబ్బరి కాయలు కొడుతూ హారతులతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు. ర్యాలీలో భక్తులు కాషాయ జెండాలతో, జైశ్రీరామ్ నినాదాలతో అంగరంగ వైభవంగా హోరెత్తించారు.
భక్తి పాటలపై హనుమాన్ దీక్ష స్వాములు నృత్యాలు చేస్తూ త్రికూటేశ్వర ఆలయం నుండి ర్యాలీగా ప్రారంభించి, అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ర్యాలీ ముగించారు. అంతకుముందు కోటేశ్వర చారి, చక్రాచారి ఆలయ పూజారులు అర్చన, హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ద్వజారోహణ జెండాను అర్చకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ముల్కనూర్ ఎస్సై సాయిబాబా జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో మహిళల కోలాట నృత్యాలు అందరిని అమితంగా అకట్టుకున్నాయి. ఈ శోభాయాత్రలో రత్నగిరి, కొప్పూర్, ముల్కనూర్, కొత్తపల్లి తదితర గ్రామాల నుండి హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.