హనుమకొండ చౌరస్తా/నర్సంపేట రూరల్, ఆగస్టు 30 : వేదకాలం నుంచి గణపతిని తొలుత ఆరాధించడం వల్ల మనం తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగడమే కాక కార్యంలో విజయంతో పాటు గమ్యాన్ని, లక్ష్యాన్ని పొందవచ్చనేది ప్రజల విశ్వాసం. దేవుళ్లలో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే వినాయక చవితి పిల్లలకు, పెద్దలకు ఇష్టమైన పండుగ. అందరూ ఎంతో సరదాగా, సందడిగా, వీధివీధికి విగ్రహాలు పెట్టి పూజలు అందుకుని విఘ్నాలు తొలగించే వినాయకుడి పండుగ అంటే అందరికీ ఆనందం. వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. పండుగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది. ఈ వినాయక చవితి ఉత్సవాల నుంచే కొత్త ఒరవడికి శ్రీకారం చుడుదాం. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రులను పురస్కరించుకుని గణేశ్ మండపాలు రూపుదిద్దుకుంటున్నాయి. మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీలు, యువత నిమగ్నమయ్యింది. ప్రతిష్ఠాపనకు గణనాథులను తరలిస్తున్నారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనాలు, రంగులతో తయారు చేసిన ప్రతిమల కంటే మట్టి వినాయకులనే ప్రతిష్ఠించి పూజించేందుకు సిద్ధమవుతున్నారు. జైజై గణేశా అంటూ మండపాల్లో గణపతులను నెలకొల్పేందుకు నిర్వాహకులు విగ్రహాలను తరలిస్తున్నారు. గణనాథుడి తొలి పూజకు మండపాలు ముస్తాబయ్యాయి. పండుగ వేళ పూజా సామగ్రి కోసం ప్రజలు రోడ్లపైకి రావడంతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. గణపయ్య ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు. పలు కూడళ్లు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. విగ్రహాల కోసం వస్తున్న వారితో పాటు, పూజా సామగ్రి కోసం రోడ్లపైకి రావడంతో ప్రధాన కూడళ్లు, మార్కెట్ల వద్ద జన సందడి పెరిగింది.
పర్యావరణ పరిరక్షకుడు
మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుతో పర్యావరణం పరిరక్షించబడుతోంది. మట్టి వినాయకుడిని శ్రద్ధాసక్తులతో పూజించిన 21 రకాల పత్రాలన్నింటిని స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయాలి. మట్టి వినాయకుడితో పాటు పూజించిన పత్రాలను నీటిలో వేయడం వల్ల వినాయకుడి రూపం మెల్లగా కరిగి నీటిలో కలిసిపోతుంది. పత్రాలన్నీ ఆయుర్వేద, ఔషధ గుణాలు కలిగినవే. అవి 23 గంటల వ్యవధి తర్వాత తమలో ఉన్న ఔషధ గుణాలు, ఆల్కలాయిడ్స్ను ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బ్యాక్టీరియా ను నిర్మూలించి, జలాల్లో ఆక్సీజన్ శాతాన్ని పెంచుతాయి. ఫలితంగా నీరు శుద్ధి అవుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
కులవృత్తిని మరిచిపోను..
ఎంత పెద్దచదువులు చదివినా, ఉద్యోగంలో స్థిరపడినా కులవృత్తిని మరిచిపోను. ఇప్పుడు మట్టి వినాయకులకు ప్రాధాన్యత పెరిగింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కొనుగోలు చేయడం లేదు. మట్టివినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు.
– రజినీకాంత్,సాఫ్ట్వేర్ ఉద్యోగి
మట్టి వినాయకులను పూజిద్దాం..
మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలి.. ముందుగానే పూజాసామగ్రి, మట్టి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రతిఇంటా గణనాథుడు కొలువుదీరనున్నాడు. నవరాత్రులు పూజలు అందుకోనున్నాడు. మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడుకుందాం.
– పద్మ, హనుమకొండ
ప్రజల్లో చైతన్యం కోసమే..
మట్టి గణపతులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావానికి తీవ్ర కృషి చేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మరో ఉద్యమంలా ఉరుకులు పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎలాంటి మంచి పనికైనా మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆచరిస్తే పెద్ద కష్టమైన పనేం కాదిది.. భూమిని చీల్చుకొస్తూ పుట్టే మొలక పచ్చని మొక్కలా ఎదిగినట్టు.. ఒక మంచి పండుగ సందర్భంగా మొగ్గ తొడిగిన ఈ ఆలోచన ఉన్నత ఆశయాల దిశగా ఎదిగేట్టు ఇప్పుడే ప్రయత్నం ప్రారంభిద్దాం.
వరాలిచ్చే వరసిద్ది వినాయకుడు
శాయంపేట, ఆగస్టు 30 : శాయంపేట మండలం పెద్దకోడెపాకలో కాకతీయులు నిర్మించిన త్రికూటాలయం ప్రాంగణంలో రాష్ట్రంలో వరసిద్ది వినాయకుడు కొలువై ఉన్నాడు. కోరిన కోర్కెలు తీర్చే ఆదిదేవుడిగా ఆరాధింపబడుతున్నాడు. వందల ఏండ్ల క్రితం కాకతీయులు ఇక్కడ త్రికూటాలయాన్ని నిర్మించారు. దీని పక్కనే భారీ రాతి వినాయకుడి విగ్రహాన్ని చేయించినట్లు చెబుతున్నారు. ఇలాంటి వరసిద్ది వినాయకుడి విగ్రహం రాష్ట్రంలోనే మొదటిదని, రెండోది హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో ఉన్నట్లు ఆలయ పూజారి అనుదీప్శర్మ చెప్పారు. హైదరాబాద్, సూర్యాపేట, వరంగల్, పరకాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ వినాయకుడిని పూజిస్తుంటారు. ముఖ్యంగా సంతానం లేనివాళ్లు ఈ వినాయకుడిని పూజిస్తే సంతాన భాగ్యం కలిగి సుఖసంతోషాలతో ఉంటారని పూజారి తెలిపారు. నిత్యం వినాయకుడికి రుద్రాభిషేకాలు నిర్వహించిన తర్వాతే శివుడికి పూజలు చేస్తారు. సంతానం, అక్షరాభాస్యం కోసం దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పూ జించి మంచి ఫలితాలను పొందుతున్నారు. కొన్నేండ్ల క్రితం ఈ గణపతి విగ్రహం బయ ట ఉండగా ప్రస్తుతం ప్రత్యేకంగా ఆలయం నిర్మించారు. నేటి నుంచి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రుల్లోనూ ఈ వరసిద్ది వినాయకుడికి పూజలు చేయనున్నారు.
మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం
పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ నడుస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. కాలుష్యానికి కారణమయ్యే ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణహిత గణపతులకు ప్రాధాన్యమిద్దాం. వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాలతో తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతోంది. మనం చేసే పనుల వల్ల ఎదుటివారికి ఏ చిన్న కష్టం రాకూడదు. మన పండుగల పరమార్థం కూడా ఇదే. మట్టి గణపతులను పూజించడంతోనే సరిపోదు. రోడ్లన్నీ మూసుకుపోయేలా అడ్డదిడ్డంగా మండపాలు నిర్మించి, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. కాలనీవాళ్లంతా కలిసి ఒకే గణపతిని పెడితే ఇంకా మంచిది. గ్రామాల్లో అయితే ఒక ఊరిలో అందరూ ఒకే విగ్రహం పెట్టుకుంటే మేలు.