హనుమకొండ, ఆగస్టు 23 : ప్రజలు, కార్యకర్తలు లేకపోవడంతోనే ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గూండాలు, బౌన్సర్లను పెట్టుకొని యాత్ర చేపడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. బండి సంజయ్ యాత్రను చూస్తున్న ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అడ్డుకుంటున్నారన్నారు. మంగళవారం సాయంత్రం హనుమకొండలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లోని క్యాంపు కార్యాలయంలో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై ఈగ వాలనీయమని, రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన సీఎం కేసీఆర్ కుటుంబం వెంటే తెలంగాణ ప్రజానీకం అంతా ఉందన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ చేసిన దాడిని ఖండిస్తున్నామని, ఆమె కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దుతు తెలుపుతుందన్నారు. సంబంధం లేని లిక్కర్ విషయంలో కేంద్రం బురద చల్లి, కేసులో ఇరికించాలని చూస్తున్నదని.. కవిత జోలికి వస్తే యావత్ తెలంగాణ కన్నెర్ర చేస్తుందన్నారు. ఆరోపణలు తిప్పికొట్టే సరికి కవితపై హత్యాయత్నానికి బీజేపీ కార్యకర్తల పేరుతో గూండాలను ఆమె ఇంటిమీదికి పంపారని ఆరోపించారు. ఎన్నో త్యాగాల కోర్చి రాష్ర్టాన్ని సాధించి ‘బంగారు తెలంగాణ’ చేస్తున్న సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. పగటి కలలు కంటున్న మునుగోడులో బీజేపీకి గోడే మిగిలుతుందని మంత్రి ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వం విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.
అమిత్‌షాకు బానిస సంజయ్
గుజరాత్ వ్యక్తి అమిత్‌షా బూట్లు మోసి బండి సంజయ్ బానిస సంజయ్ అయ్యారని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. బూట్లు మోసిన బండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టాడని ఆరోపించారు. బూట్లు మోయడం కాదు సంజయ్ నీకు దమ్ముంటే రాష్ట్రం కోసం కొట్లాడాలని సవాల్ విసిరారు. బుద్ధి, తెలివి, సోయి ఉంటే సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు అమిత్‌షాతో సమాధానం చెప్పించాలని డిమాండ్ చేశారు. గూండాలను, బౌన్సర్లను వేసుకొని తిరుగడం, టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేయించడం కాదు మేము, మా పార్టీ కార్యకర్తలు తిరుగబడితే నువ్వు ఎక్కడ ఉంటావో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. మొన్న పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పులలో బండి సంజయ్ బౌన్సర్లు, గూండాలతో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేయడం వల్ల మహిళా కార్యకర్తతోపాటు కార్యకర్తలకు గాయాలు అయ్యాయన్నారు. ఇప్పుడు జనగామ జిల్లాలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్ని రౌడీయిజానికి దిగారని ఆరోపించారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఆదర్శ పాలన సాగిస్తున్న కేసీఆర్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక బీజేపీ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అనడం అమిత్‌షా తెలివితక్కువ తనమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి తిరగబడ్డ రైతులపై కార్లు ఎక్కించి కాల్పులు జరిపి 700 మందిని పొట్టన పెట్టుకొన్నది ఎవరని మంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ప్రజలను రెచ్చగొట్టే యాత్ర : ఎమ్మెల్యే అరూరి రమేశ్
బండి సంజయ్‌ది ప్రజా సంకల్ప యాత్ర కాదని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే యాత్ర అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. యాత్ర పేరుతో పెట్టే చిచ్చును ప్రజలు గమనిస్తూనే బండిని ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. పాదయాత్ర పేరుతో పచ్చగా ఉన్న తెలంగాణలో విషం చిమ్ముతున్నారన్నారు. వరంగల్ ఉద్యమాల ఖిల్లా అని, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ప్రజలు బీజేపీని నమ్మరన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు రెచ్చగొట్టే ప్రకటనల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: చీఫ్ విప్ దాస్యం
ముప్పై ఏళ్లుగా చాలా రాజకీయ పార్టీలను చూశా కానీ.. బీజేపీ లాంటి నీచమైన పార్టీని చూడలేదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. కొన్ని రోజుల నుంచి తొండి సంజయ్ రౌడీలు, గూండాలతో మత విద్వేషాలు రగిలిస్తూ పాదయాత్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబసభ్యులపై దొంగ ప్రకటనలు చేస్తూ. ఒక మహిళ అని చూడకుండా ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ చేసిన దాడి ఖండిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ సూచనల మేరకు తొండి సంజయ్ దొంగ ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కేసీఆర్, కుటుంబ సభ్యులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. షిండేలు ఉన్నారని చెప్తున్నారంటూనే శిఖండి, షిండేలు చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయని పేర్కొన్నారు. ఇన్ని రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ రైతులు, యువకులు, విద్యార్థుల సమస్యలను ఏమైనా తెలుసుకొన్నారా అని ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ చౌకబారు మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో శిక్ష తప్పదని చీఫ్ విప్ హెచ్చరించారు.