ఖిలావరంగల్ : కళా రంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి సమగ్ర సాంస్కృతిక విధానం అమలు చేసి కళాకారులకు గుర్తింపు, హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రజానాట్యమండలి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దామెర విజయ్ కుమార్ అన్నారు. కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవితానికి గాలి, నీరు, తిండి ఎంత అవసరమో మనిషి మానసిక వికాసానికి సామాజిక పురోగతికి కళలు కూడా అంతే అవసరమన్నారు.
ఈ సత్యాన్ని గుర్తించి మనకున్న కళా సంపదను పరిరక్షించడమే గాక పురోగమనానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అంతరించిపోతున్న కళలను, కళాకారులకు ప్రభుత్వం వివిధ రంగాలలో అవకాశాలు కల్పించి కాపాడుకోవాలన్నారు. కళాకారుల పిల్లలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని, స్పోర్ట్స్ కోటాలో క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చినట్లుగానే కళాకారులకు కూడా సాంస్కృతిక కోటా కింద ఉద్యోగాలు కల్పించాలన్నారు లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజ నాట్య మండలి గౌరవ అధ్యక్షుడు గన్నారపు రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సువర్ణ, సహాయ కార్యదర్శి సుప్రియ, కుంట శాంతి, ఉపాధ్యక్షులు జన్ను రాజు, చిరంజీవి, శ్రీలతన, సుమలత, రజిత, సాంబయ్య, విమల, స్వప్న, వసంత తదితరులు పాల్గొన్నారు.