హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 7 : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్ మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు శాపంగా మారిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు, సంక్షేమ హాస్టల్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.