ఖిలావరంగల్, జనవరి 05 : శివనగర్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న బీసీ హాస్టల్ భవనం కారణంగా స్థానిక ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ భవనం ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రైమరీ స్కూల్‌తో పాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన హాస్టల్ భవనం నిర్మించాలని కోరుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు ఆయన వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం శివనగర్ పరిసర ప్రాంతాల్లో ప్రాథమిక విద్యా సౌకర్యాలు తక్కువగా ఉండటంతో చిన్నారులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా పేద కుటుంబాల పిల్లలు చదువు మధ్యలోనే మానేసే ప్రమాదం ఉందని కార్పొరేటర్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. శిథిలావస్థలో ఉన్న పాత బీసీ హాస్టల్ భవనం ప్రమాదకరంగా మారిందని, ఎలాంటి ప్రమాదాలు జరిగినా ఆశ్చర్యం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శివనగర్ ప్రభుత్వ పాఠశాల భవనంలో ఉన్నత, ప్రైమరీ స్కూళ్లు కలిసి కొనసాగుతున్నందున విద్యార్థులకు సరిపడా వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ప్రస్తుతం బీసీ హాస్టల్ భవనం ఉన్న స్థలం సుమారు 1000 గజాల మేర విస్తీర్ణం కలిగి ఉందని, ఈ స్థలంలో పాత భవనాన్ని కూల్చి పక్కనే ప్రైమరీ స్కూల్‌తో పాటు హాస్టల్‌కు అనువైన నూతన భవన నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ ప్రతిపాదన అమలైతే శివనగర్తో పాటు పరిసర కాలనీలకు చెందిన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, విద్యాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని కార్పొరేటర్ తెలిపారు. ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆయన కోరారు.