మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు
నేడు ఉదయం 10 గంటల నుంచి 11గంటల వరకు కార్యక్రమం
‘ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు’ నినాదంతో ముందుకు
ఆయాచోట్ల పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
వరంగల్ కోట లో ‘కేటీఆర్ గ్రీన్ ఆర్ట్’
వరంగల్‌రూరల్, జూలై 23(నమస్తేతెలంగాణ)/వరంగల్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం ఉమ్మడి జిల్లాలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఊరూరా ఈ కార్యక్రమం నిర్వహణకు సిద్ధమయ్యారు. ప్రతి పంచాయతీ పరిధిలో 1,500 చొప్పున ఉమ్మడి జిల్లాలో సుమారు 30లక్షలకు పైనే మొక్కలు నాటనున్నారు. ఈ మేరకు గుంతలు తవ్వించారు. రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండ్ల ఆవరణలో మొక్కలు నాటనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
వృక్షార్చనలో ఉదయం 10 గంటలకు రాయపర్తి మండలంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొంటారు. నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాలలో చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేటలో అరూరి రమేశ్, భూపాలపల్లి పరిధిలో గండ్ర వెంకటరమణారెడ్డి, జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రా థోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, డోర్నకల్‌లో డీఎస్ రెడ్యానాయక్, స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య, ఆయా జిల్లాల జడ్పీ అధ్యక్షులు కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటడమే కాకుండా పార్టీ శ్రేణులు, ప్రజలతో విరివిగా నాటించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరంగల్ పశ్చిమంలో చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ బాల సముద్రంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో వృక్షార్చనకు సన్నాహాలు చేశారు. తూర్పులో ఎమ్మ్యె నన్నపునేని నరేందర్ ఒకే చోట 30 ఎకరాల మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో..
గ్రేటర్ కార్పొరేషన్ అధ్వర్యంలో చింతగట్టు క్యాంపు కార్యాలయం సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ వెంబడి 10వేల మొక్కలు, మంత్రపురి కాలనీ సమీపంలో గుర్తించిన ఐదెకరాల్లో 40 వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. కాకతీయ పట్ణణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భట్టుపల్లి నర్సరీ ప్రాంగణంలో మొక్కలు నాటనున్నారు.
ఆకట్టుకుంటున్న ‘కేటీఆర్ గ్రీన్ ఆర్ట్’
ఖిలావరంగల్ కోటలో ముక్కోటి వృక్షార్చన కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే నరేందర్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కాగా వరంగల్ కోటలో వృక్షార్చనలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ‘కేటీఆర్ గ్రీన్ ఆర్ట్’ ఆకట్టుకుంటోంది.
ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు
‘ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు’ అన్న నినాదంతో ము క్కోటి వృక్షార్చనను విజయవంతం చేయనున్నారు. శనివా రం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య అన్ని చోట్లా మొక్కలు నాటనున్నారు.