Telangana Express | కాజీపేట, జూలై 05: ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోతున్న ఓ బాలుడిని జీఆర్పీ పోలీసులు రక్షించారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రయాణికులు గుర్తించి కాజీపేట రైల్వే జంక్షన్లో పోలీసులకు అప్పగించారు.
కాజీపేట జీఆర్పీ సీఐ వడ్డే నరేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం నాడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో సికింద్రాబాద్ నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు ప్రయాణిస్తున్న బి.చంద్రశేఖర్, ఎండీ అజార్ అలీ అనే ఇద్దరు ప్రయాణికులకు 13 ఏళ్ల బాలుడు అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని వివరాలు అడగ్గా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో ఆ బాలుడిని పట్టుకుని కాజీపేట జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో జీఆర్పీ పోలీసులు సదరు బాలుడిని విచారించి వివరాలు రాబట్టారు.
బాలుడిని మెదక్ జిల్లాలోని మెదక్ చర్చి సమీపంలో నివసించే కంచుమూర్తి గంగాధర్ కుమారుడు ప్రీతమ్ సందీప్‌గా గుర్తించారు. ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చినట్లు తమ విచారణలో బాలుడు చెప్పాడని సీఐ నరేశ్ కుమార్ తెలిపారు. కాగా, ప్రీతమ్ సందీప్‌ను పునరావాసం కోసం హనుమకొండ చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్ హరీశ్‌కు అప్పగించామన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని తెలిపారు.