కరీమాబాద్, మే 24 : సీఎం కేసీఆర్ పాలనలో హెల్త్‌సిటీగా రూపుదిద్దుకుంటున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జిల్లాకు పలు కొత్త అసిస్టెంట్ పోస్టులు నేపథ్యంలో బుధవారం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేసీఆర్ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా వరంగల్ నగరాన్ని మెడికల్ హబ్‌గా మారుస్తున్నారని పేర్కొన్నారు. సుమారుగా రూ.1,250కోట్లతో దేశం అబ్బురపడేలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నారని తెలిపారు. తాజాగా ప్రభుత్వం జిల్లాలోని సీకేఎం, కేఎంసీ, ఎంజీఎం దవాఖానకు 52 న్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మంజూరు చేసిందన్నారు. కాకతీయ మెడికల్ కళాశాలకు 23, ఎంజీఎం దవాఖానకు 27, సీకేఎంకు 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించారని వివరించారు. దీంతో పేదలకు మరింతగా మెరుగైన వైద్యసేవలు అందుతాయని చెప్పారు.
ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వాలు వైద్యరంగాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ వైద్య రంగానికి కోట్లాది రూపాయల నిధులను ఇస్తున్నారని చెప్పారు. జిల్లాకు పలు పోస్టులను కేటాయించినందుకు గాను సీఎం కేసీఆర్, సంబందిత శాఖ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్, కార్పొరేటర్లు సిద్దం రాజు, రవి, కవిత, కుమారస్వామి బీఆర్ఎస్ నాయకులు పల్లం రవి, నాగపురి సంజయ్‌బాబు, మోడెం ప్రవీణ్, మేడిది మధుసూదన్, బైరబోయిన దామోదర్, యెలగం సత్యనారాయణ, వొగిలిశెట్టి అనిల్‌కుమార్, ముష్కమల్ల సుధాకర్ పాల్గొన్నారు.