మడికొండ, సెప్టెంబర్ 17 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ ఇన్సియేటివ్ ప్రోగ్రాంలో భాగంగా ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0 కార్యక్రమంలో ‘జాయిన్ ది ఫైట్ ఫర్ గార్బేజ్ ఫ్రీ సిటీస్’ అంశంపై గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మడికొండ మెట్టుగుట్టపై ఆదిరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 నుండి అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇండియన్ స్వచ్ఛత లీగ్ విజన్‌లో యువతను భాగస్వామ్యం చేస్తూ బల్దియా ఆధ్వర్యంలో ఫ్లాష్ మాబ్, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో వరంగల్ స్వచ్ఛ వారియర్స్ పెద్ద ఎత్తున పాల్గొనడం హర్షణీయమన్నారు. జాతీయ సమైక్యతతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా కిట్స్ కళాశాల, మడికొండ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్, ఎల్బీ కళాశాల ఎన్సీసీ కెడెట్ల పిరమిడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు శ్రీస్వయంభూలింగేశ్వరస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం మేయర్‌తో పాటు కార్పొరేటర్లు, అధికారులు ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మునిగాల సరోజన, ఆవాల రాధికారెడ్డి, అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్, సీఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, డీఎఫ్‌వో శంకర్లింగం, టీపీఆర్వో రాజేశ్‌కుమార్, టీఎంసీ రమేశ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, డీఆర్సీసీ నిర్వాహకులు పాల్గొన్నారు.