పల్లెపోరుకు కసరత్తు మొదలైంది. షెడ్యూల్ ఎప్పుడొచ్చినా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారం యంత్రాంగం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఇప్పటికే గ్రామాలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేసింది. ఇటీవల పోలింగ్ కేంద్రాల గుర్తింపును పూర్తిచేసి ముసాయిదా జాబితాను ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించింది.
నేడు పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను వెల్లడించనున్నది. అలాగే బ్యాలెట్ పేపర్లు ప్రింటింగ్ చేసి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయగా ఆమేరకు పీఆర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలుకాగా, ఆశావహులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతుండడంతో రాజకీయం రసవత్తరంగా మారనున్నది.
– జనగామ, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ)/హనుమకొండ
పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2024 జనవరి 31న ముగిసింది. ఫిబ్రవరి నుంచి గ్రా మ పంచాయతీలు, వార్డులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాల వల్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాత్కాలికంగా పల్లెల్లో ప్రత్యేక అధికారులను నియమించి వారితో పాలన కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగునన్న సందర్భంగా ఎన్నికల వేడి రాజుకొంటున్నది.
దీంతో గ్రామాల్లో వివిధ రాజకీయ పా ర్టీలకు చెందిన నాయకుల వద్దకు ఇప్పటి నుంచి ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. నాయకులను ప్రసన్నం చేసుకొని ఏలాగైన పదవి దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం ఆశావహులను ఎవరినీ వదులుకోకుండా అందరికీ హామీలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గ్రామంలో ఎక్కడ నలుగురు కలిసినా పంచాయతీ ఎన్నికలతో పాటు ప్రభు త్వ పనితీరుపై జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు రాజకీయ పార్టీలు పైచేయి సాధించాలని నాయకుల ఆ ధ్వర్యంలో సమీకరణాలు మొదలయ్యాయి. ఎలాంటి అభ్యర్థిని పెడితే బాగుంటుంది? ఇతర పార్టీల అభ్యర్థులను ఎదిరించాలంటే ఎలాంటి వ్యూహాలు రచ్చించాల్సిన అవసరం ఉంది? అనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి.
గతంలో ఎన్నికల్లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యులందరు ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకొనేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 650మంది ఓటర్లు ఉండనున్నారు. ఒకవేళ ఇంతకుమించితే అదనంగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు. అయితే హనుమకొండ జిల్లాలో అలా లేదని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇప్పటికే పోలింగ్ స్టేషన్లను గుర్తించిన అధికారులు ఈ 7న 1,986 పోలింగ్ స్టేషన్లతో ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటించి 13వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం నేడు పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను వెల్లడించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రింటింగ్ పేపర్లను ముంద్రించే పనిలో పంచాయతీరాజ్ అధికారులు నిమగ్నం అయ్యారు. ఇందుకు అవసరమైన వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు. అభ్యర్థులను బట్టి బ్యాలెట్ పేపర్ సైజు ఉంటుందని పీఆర్ అధికారులు తెలిపారు.
హనుమకొండ జిల్లాలో.. 14 మండలాలుండగా 12 మండలాల పరిధిలోని 210 గ్రామ పంచాయతీలకు, 1986 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 3,70,932 మంది (పురుషులు 1,81,012 మంది, మహిళలు 1,89,918 మంది, ఇతరులు ఇద్దరు) ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జనగామ జిల్లాలోని 12 మండలాల పరిధిలో 283 పంచాయతీలుండగా 2,576 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 4,09, 797మంది (పురుషులు 2,03,097, మహిళలు 2,06,696, ఇతరులు 4) ఓటర్లు ఉన్నారు.ఇందుకు సంబంధించిన ఓటరు జాబితాను పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలో వచ్చినా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే వార్డు ల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేశాం. గ తంలో జరిగిన పొరపాట్లకు తావులేకుండా కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకొనేలా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే పోలింగ్ పర్సన్స్ వివరాలు సేకరించాం. ముసాయిదా పోలింగ్స్టేషన్ల జాబితాను ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించాం. నేడు తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను వెల్లడిస్తాం. అలాగే బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను ప్రారంభించాం.
– లక్ష్మీరమాకాంత్, హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి