ఆహ్లాదకరమైన వాతావరణం.. ఆధ్యాత్మిక కేంద్రాలతో ములుగు జిల్లా పర్యాటక పరంగా పరిఢవిల్లుతున్నది. ఇక్కడి ప్రకృతి రమణీయత దేశ, విదేశాల సందర్శకులను కట్టిపడేస్తున్నది. దీంతో జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. అడవులు, ఆలయాలు, జలపాతాలు, సరస్సులతో అలరారుతున్న ఈ ప్రాంతం విశేషంగా ఆకట్టుకుంటున్నది. జిల్లా ప్రారంభంలో ఉండే ఆది దేవత గట్టమ్మ నుంచి చివరన ఉండే బొగత, ముత్యంధార జలపాతం వరకు ప్రతి ప్రాంతం ప్రత్యేకతను సంతరించుకున్నది. ప్రతి రోజు వచ్చిపోయే టూరిస్టులతో కళకళలాడుతున్నది. ఫలితంగా ప్రభుత్వానికి కోట్లల్లో ఆదాయం సమకూరుతున్నది.
– ములుగు, జనవరి 4 (నమస్తే తెలంగాణ)
ప్రకృతి అందాలను తనలో ఇనుమడించుకున్న ములుగు జిల్లాలోని ప్రతి ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. పరుగులు పెట్టే వాగులు, వంకలు.. పక్షుల కిలకిల రావాలు.. ఎత్తైన పచ్చని కొండలు.. పాలనురగల జలపాతాలు.. ఏడాది పొడవునా నీటితో కళకళలాడే సరస్సులు, జలాశయాలు, కాకతీయులు నిర్మించిన ఆలయాల్లోని అద్భుత శిల్పాలు, భక్తి భావాన్ని పెంపొందించే పుణ్య క్షేత్రాలు పర్యాటకులు, భక్తులను కట్టి పడేస్తున్నాయి. రాష్ట్రం లో ఎక్కడా లేని విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం విస్తరించి ఉన్న ములుగు జిల్లాను వీక్షించేందుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం (నూగూ రు) మండలాల్లోని అడవులు, వాగులు, వంక లు, ముళ్లకట్ట బ్రిడ్జి ప్రకృతి పరంగా ఆకర్షిస్తున్నాయి.
వెంకటాపూర్ మండలంలోని రామ ప్ప ఆలయంతో పాటు తాడ్వాయిలోని మేడారం, మంగపేటలోని మల్లూరు లక్ష్మీ నర్సింహస్వా మి ఆలయం ఆధ్యాత్మికంగా విశేష గుర్తింపు పొందా యి. పర్యాటక పరంగా రామప్ప, లక్నవరం జలాశ యం, తాడ్వాయి అడవులతో పాటు అదే మండలంలోని ఆది మానవుల సమాధులు, నిత్యం మొక్కులు అందుకునే ము లుగులోని ఆది దేవత గట్టమ్మ దేవాలయం, కొత్తూరు దేవునిగుట్ట, నిత్యం ఫొటో, వెడ్డింగ్ షూట్లతో అలరారుతున్న జాకారంలోని కాకతీయుల దేవాలయం, వాజేడులోని బొగత, వెంకటాపురం(నూగూరు)లోని ముత్యంధార జలపాతాలు ప్రాచుర్యం పొందాయి.
ఇటీవల తాడ్వాయి అటవీ ప్రాంతంలో బ్లాక్ బెర్రీ ఐలాండ్‌ను అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సులో 3వ ఐలాండ్‌ను నూతన హంగులతో అభివృద్ధి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టమ్మ ఆలయం, తాడ్వాయి మండల కేంద్రం, ముళ్లకట్ట బ్రిడ్జి, మల్లూరులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అధునాతన హంగులతో అతిథి గృహాలను నిర్మించింది. పర్యాటకులు ఆన్లైన్లో ములుగు జిల్లా ఖ్యాతి ని తెలుసుకుంటూ పర్యాటక ప్రాంతాలు, దేవాలయాల సందర్శనకు విచ్చేస్తున్నారు.
ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక కేంద్రాలతో ములుగు జిల్లా పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకర్షించింది. గతేడాది పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 12 నెలల కాలంలో 1,71,51,185 మంది భక్తులు, పర్యాటకులు ములుగు జిల్లాకు రాగా వారి నుంచి రూ.19.60 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఫిబ్రవరిలో నిర్వహించిన సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు 1,50,11,000 మంది భక్తులు హాజరు కాగా, ప్రతి శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో వచ్చిన వారితో రూ. 14 కోట్ల ఆదాయం లభించింది.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలోని శిల్ప సంపదను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి వచ్చిన 8,04,600 మంది భక్తులతో రూ. 35 లక్షలు సమకూరాయి. రాష్ట్రంలోనే తొలిసారి ఉయ్యాల వంతెనను ఏర్పాటు చేసిన లక్నవరం సరస్సు అందాలను చూసేందుకు 5,46,411 మంది పర్యాటకులు విచ్చేయగా రూ. 4.12 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణ నయాగరగా పేరొందిన బొగత జలపాతాన్ని వీక్షించేందుకు 6,18,730 మంది రాగా అటవీ శాఖకు రూ. 25 లక్షల ఆదాయం సమకూరింది. మంగపేట మండలంలోని మల్లూరు గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని 1,70,444 మంది భక్తులు సందర్శించగా రూ. 88 లక్షల ఆదాయం వచ్చింది.