ములుగు జిల్లా వైద్య కళాశాల సిబ్బంది నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అనుభవం లేని వారికి ఉద్యోగాలు కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ దవాఖాన జూనియర్ అసిస్టెంట్ సోదరుడికి థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్‌కు డిసెక్షన్ హాల్ అటెండెంట్‌గా పోస్టులివ్వడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా మెడికల్ కాలేజీ ఉద్యోగ నియామకాల్లో రాజకీయ ఒత్తిళ్లు పనిచేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
– ములుగు, జూలై28 (నమస్తే తెలంగాణ)
ములుగు మెడికల్ కళాశాలలో చేపట్టిన 32 ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఎంపికలో అక్రమాలు జరుగుతున్నాయని గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ కుమార్తెకు, ఓ ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్‌కు డిసెక్షన్ హాల్ అటెండెంట్లుగా, ప్రభుత్వ దవాఖానలో జూనియర్ అసిస్టెంట్ సోదరుడికి, డిగ్రీ చదివిన ఓ వ్యక్తికి థియేటర్ అసిస్టెంట్ పోస్టులివ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఉద్యోగాలకు ఏదేని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రెండేళ్లపాటు అనుభవం ఉండాలని నిబంధనల్లో పేర్కొన్న అధికారులు అవేవీ పట్టించుకోలేదు. వీరికి ఎలాంటి అర్హతలున్నాయి? అనుభవం ఉందా? లేదా? అనే కారణాలను గాలికొదిలేశారు.
ఉద్యోగాల భర్తీలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని జూన్‌లో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘కొలువులు.. మస్తు పైరవీలు’ కథనానికి అధికారులు స్పందించి పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామని ప్రకటించి కేవలం డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు టైపింగ్ పరీక్ష నిర్వహించారు. అన్ని పోస్టుల భర్తీలో ప్రొవిజనల్ లిస్టును నోటీస్ బోర్డుపై ప్రదర్శించిన అధికారులు మెరిట్ ఉన్న 1:2 కానీ, 1:3 కానీ పెట్టకుండా డైరెక్టర్‌గా వారికి నచ్చిన వారినే ఎంపిక చేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వైద్య కళాశాల ఉద్యోగ నియామకాల్లో రాజకీయ ఒత్తిళ్లు పనిచేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారులు, ఉన్నత వైద్యాధికారులు, ఉపాధి కల్పన అధికారిని తప్పుదోవ పట్టించి జరిపిన నియామకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకొని అర్హులకు న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఉద్యోగ నియామకాలను 100 శాతం పారదర్శకతతో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థుల్లో అనర్హులు ఉన్నట్లయితే విచారణ జరిపి నియామకాలను రద్దు చేస్తాం. కళాశాల ప్రారంభమైతే మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్ట్ నుంచే రెండో, మూడో విడతలో ప్రాధాన్యత ఇస్తాం. ప్రస్తుతం జరిగిన ఎంపికలో కింది స్థాయి సిబ్బంది ప్రమేయం ఉంటే చర్యలు చేపట్టి నియామకాలపై పున:సమీక్ష చేస్తాం.
– డాక్టర్ మోహన్‌లాల్, ములుగు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్