రాయపర్తి, డిసెంబర్ 23: అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని డీపీవో ప్రభాకర్ సూచించారు. మైలారంలో గురువారం ఆయన ఎంపీవో తుల రామ్మోహన్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జీపీ రికార్డులు, రిజిస్టర్లు, ఉద్యోగులు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించి, సిబ్బంది పనితీరు, పన్నుల వసూళ్లను కార్యదర్శి బెజ్జంకి సుమలతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్ లేతాకుల సుమతీ యాదవరెడ్డితో కలిసి వైకుంఠధామం, నర్సరీ, పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డును పరిశీలించారు. పల్లెప్రగతి కార్యక్రమాల నిర్వహణ నిరంతర ప్రక్రియగా గుర్తించాలన్నారు.
పల్లెప్రగతి పనులపై దృష్టి సారించాలి
పల్లెప్రగతి అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్పీవో వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆయన ధర్మారావుపేట గ్రామ పంచాయతీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వీధుల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, నర్సరీ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జీపీలో రికార్డులను పరిశీలించారు. గత కార్యదర్శి గోవిందరాజు రూ. 4 లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడడంతో అతడికి ఫోన్ చేసి నిధులను వెంటనే జీపీలో జమ చేయాలని ఆదేశించారు. డీఎల్పీవో వెంట సర్పంచ్ వెన్ను శ్రుతి, పూర్ణచందర్, సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గొండి మండలంలోని పొనకల్, గుడిమహేశ్వరంలో జీపీ రికార్డులు, పల్లెప్రగతి పనులను ఎంపీడీవో కృష్ణప్రసాద్ తనిఖీ చేశారు. నర్సరీ ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. నర్సరీలో గ్రామస్తులకు సరిపడా మొక్కలు పెంచాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ బొమ్మగాని ఉర్మిళావెంకన్న, కార్యదర్శులు ఉన్నారు. పర్వతగిరి మండలంలోని నారాయణపురంలో నర్సరీని ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్ పరిశీలించారు. రోజూ ఉదయం, సాయంత్రం నర్సరీ బ్యాగులను పూర్తిగా తడిసేలా నీళ్లు పట్టాలన్నారు. ఆయన వెంట ఏపీవో సుశీల్‌కుమార్, కార్యదర్శి సృజన, జీపీ సిబ్బంది ఉన్నారు.