గణపురం, ఏప్రిల్ 10 : కేటీకే ఓసీ-3 నుంచి వచ్చే దుమ్ము, ధూళితో రోగాల పాలవుతున్నామని, తమ వ్యవసాయ భూములు సింగరేణికి అప్పగించడంతో ఉపాధి లేక ఉపాసముంటున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరశురాంపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మీకు దండం పెడతాం సార్లు.. మా గ్రామాన్ని త్వరగా తరలించి న్యాయం చేయండి అని వేడుకుంటున్నారు. గురువారం తమకు పునరావాస ప్యాకేజీ అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓసీ-3 ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత నెల 10న ధర్నా చేసినప్పుడు సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి వచ్చి నెల రోజుల్లో సమస్యను పరిషరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చి పట్టించుకోవడంలేదన్నారు. చేసేదేమీ లేక గ్రామస్తులందరం కలిసి ఆందోళనకు దిగామన్నారు. ఎంతో విలువైన తమ పొలాలను తీసుకొని గ్రామాన్ని తరలించకపోవడం వల్ల ఉపాధి లేక, తాగునీళ్లు దొరకక అల్లాడిపోతున్నామన్నారు. తమ పిల్లలకు ఉద్యోగాలు దొరికి ఉపాధి లభిస్తుందని ఆశపడ్డామని, ఈ విషయంలో సింగరేణి సంస్థ పూర్తిగా విఫలమైందన్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు వినతిపత్రాలు ఇస్తున్నా తమకు న్యాయం జరగడం లేదన్నారు. భూములు తీసుకునే సమయంలో ఉద్యోగాలు, పునరావాస ప్యాకేజీ ఇస్తామని సింగరేణి అధికారులు మాయమాటలు చెపితే భూములిచ్చామన్నారు.
అనంతరం సగం ఊరును సింగరేణి సర్వే చేసి అక్కడి వరకే స్థలాలు, ఇండ్లు తీసుకుంటామని ఇప్పటివరకు తీసుకోలేదన్నారు. గ్రామాన్ని మొత్తం తీసుకోవాలన్నారు. బాంబు బ్లాస్టింగ్లతో ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని, బోర్లు వేస్తే ఎత్తిపోయి నీళ్లకు ఇబ్బంది పడుతున్నామన్నారు. గ్రామాన్ని తరలించే వరకు ధర్నాను విరమించేది లేదని మందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడికి స్థానిక ఎస్సై రేఖ అశోక్‌తో పాటు భూపాలపల్లి, టేకుమట్ల, రేగొండ ఎస్సై లు, పోలీసులు చేరుకున్నారు. అనంతరం సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, అడిషనల్ జీఎం కవీంద్ర, చిట్యాల సీఐ మల్లేశ్‌యాదవ్ అక్కడికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి వారం రోజుల్లో సింగరేణి సీఎండీతో మాట్లాడి సమస్యను పరిషరిస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.