బచ్చన్నపేట మే 19 : అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం భూస్వామ్య వ్యవస్థలను బద్దలు కొట్టి పేద ప్రజలకు భూములు పంచిపెట్టిన గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం జనగామ జిల్లా కమిటీ సభ్యుడు సుంచు విజేందర్ అన్నారు. సోమవారంసుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సీపీఎం మండల కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరయ్య పార్లమెంటు, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఆనాటి ప్రభుత్వాలపై గళమెత్తి అనేక అంశాలపై రాజకీయ ప్రత్యర్థులు సైతం ప్రశంసించే విధంగా ప్రజల మన్ననలు పొందిన గొప్ప పార్లమెంటేరియన్ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి తనకున్న వందల ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టిన గొప్ప త్యాగశీలి సుందరయ్య అని ప్రశంసించారు.
కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అదాని, అంబానీలకు కట్టబెట్టి ప్రజలపై అధిక పనుల భారాలను మోపుతుందని విమర్శించారు. సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకొని హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్, సీపీఎం మండల కమిటీ సభ్యులు రావుల రవీందర్ రెడ్డి, మిన్నలాపురం ఎల్లయ్య, అన్న బోయిన రాజు, తాడెం రాములు, ఇంజ ఎల్లయ్య గంధ మల్ల మనోహర్, మురళి, గుండా రవి, భాగ్య శిరీష, సుహాసిని, కవిత తదితరులు పాల్గొన్నారు.