హనుమకొండ, ఫిబ్రవరి 18 : హనుమకొండలోని అక్షర చిట్‌ఫండ్ ప్రధాన కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన నిర్వహించారు. బుధవారం బాలసముద్రంలోని కార్యాలయం వద్దకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. చిట్‌ఫండ్ యజమాని పేరాల శ్రీనివాసరావును వెంటనే అరె స్ట్ చేయాలని, శ్రీవిద్యకు బెయిల్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కల్పించుకొని తమకు న్యాయం చేయాలని బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. కాయకష్టం చేసి కూడబెట్టిన డబ్బులతో చిటీలు వేశామని కొందరు, ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని మరికొందరు బాధితులు వాపోయారు. చిటీ, ఫిక్స్డ్ డిపాజిట్ల గడువు ముగిసినప్పటికీ ఐదేళ్లుగా డబ్బులివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వెంటనే స్పందించి డబ్బులు ఇప్పించి, శ్రీనివాసరావును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సుబేదారి పోలీసులు చిట్‌ఫండ్ ఆఫీస్ వద్దకు చేరుకొని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
అక్షర చిట్‌ఫండ్ కార్యాలయం నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. చిట్‌ఫండ్ యాజమాన్యం నుంచి డబ్బులు ఇప్పించాలని కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. అక్షర చిట్‌ఫండ్ యజమాని పేరాల శ్రీనివాసరావును వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో మొగిలి, రామస్వామితో పాటు బాధితులు పాల్గొన్నారు.