చిట్‌ఫండ్ యజమానిని అప్పగించాలని డిమాండ్
మా డబ్బులు మాకు ఇప్పించాలని విజ్ఞప్తి
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
Hanmakonda | హనుమకొండ, జూన్ 14 : హనుమకొండ నక్కలగుట్టలోని అక్షర చిట్‌ఫండ్ ఆఫీసు ముందు బాధితులు శనివారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన బాధితులు మా డబ్బులు మాకు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆఫీసు ముందు బైఠాయించారు. చిట్టీలు, డిపాజిట్ల పేరుతో చిట్ ఫండ్ యాజమాన్యం మమ్ములను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్టీలు అయిపోయాయని, డిపాజిట్ల గడువు పూర్తైనా డబ్బులు ఇవ్వకుండా మమ్ములను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చిట్ యాజమానిని పిలిపించి అప్పగించాలని, మాకు న్యాయం చేయాలని, పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఇప్పటికే అనేక మార్లు ధర్నాలు, నిరసనలు తెలుపడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి మాకు న్యాయం జరుగుడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాయ కష్టం చేసుకొని దాచుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో గత మూడు, నాలుగు సంవత్సరాలుగా కార్యాలయం చుట్టు చెప్పులు అరిగేలా తిరుగుతున్నామని కొందరు, చిట్టీలు అయిపోగా కొన్ని డబ్బులు ఇచ్చి మిగిలిన డబ్బులకు చెక్కులు ఇచ్చారని, ఆ చెక్కుల గడువు దాటిందని మరి కొందరు, అలాగే డిపాజిట్ చేయగా మేచురిటీ గడువు పూర్తైనా డబ్బులు ఇవ్వడం లేదని ఇంకొందరు బాధితులు తెలిపారు. పెద్ద సంఖ్యలో బాధితులు అక్షర చిట్‌ఫండ్ కార్యాలయం వద్దకు చేరుకొన్న విషయాన్ని తెలుసుకున్న సుబేదారి పోలీసులు అక్కడి చేరుకొని ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, బాధితులను సముదాయించే ప్రయత్నం చేశారు. మేము ఎంతో నష్టపోయామని, గతంలో పోలీసు అధికారులు మాకు న్యాయం చేస్తానని చెప్పారని ఇంత వరకు ఏలాంటి న్యాయం జరుగలేదని వాపోయారు. ఆఫీసు మూసుకొని మాకు డబ్బులు ఇవ్వకుండా యాజమాన్యం తప్పించుక తిరుగుతుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. తమ డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. యాజామాన్యంను తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను వేడుకున్నారు. జిల్లా పోలీసులు, అధికారుల నుంచి మాకు న్యాయం జరుగక పోతే వారం రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని బాధితులు తెలిపారు.