వరంగల్ చౌరస్తా: కార్మిక, కర్షక సంఘటిత, అసంఘటిత కార్మికుల డిమాండ్ల సాధనకై మే 20న జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. మంగళవారం శివనగర్ లోని తమ్మెరభవన్ లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రాములు మాట్లాడుతూ దేశంలో రైతులు, కూలీల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు.
వ్యవసాయ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం, ఉపాధి కూలీలకు 200 రోజుల పని, రూ.700కూలీ, పట్టణాలలో ఉపాధి హామీ పనుల కల్పన, రైతు పంటలకు గిట్టుబాటు ధరల కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. 4 లేబర్ కోడ్స్ రద్దుచేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కనీస వేతనం 26 వేలు, సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు స్వస్తి పలకాలని ఉద్యోగ భద్రత తదితర డిమాండ్స్ సాధనకై జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఐక్యతా శక్తిని ప్రధర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కపల్లి రమేష్, సిలువేరు విజయ, బి.సాయిలు, వేముల బాబు, వి.ఎల్లయ్య, సాంబలక్ష్మి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.