హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 18: దళారీ వ్యాపార రాజకీయాల నుంచి తెలంగాణను కాపాడుకుందామని తెలంగాణ ఉద్యమకారుల వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత దివంగత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన హెచ్చరిక ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజలు నిత్యం చైతన్యవంతులై దురాశపరులైన పార్టీలు, నాయకులు, అధికారులు, కార్పొరేట్ సంస్థలు కలిసి రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోకుండా కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత ప్రజలదే అన్నాడు.
అందుకే మన ప్రజాస్వామ్యంలో గోకర్ణ గజకర్ణ టక్కుటమార విద్యలు నేర్చిన నాయకులు వస్తుంటారు. ప్రజలు చైతన్యవంతులు కాకపోతే అణిచివేతలు మోసాలు దోపిడి మళ్లీ మళ్లీ జరగవచ్చన్నారు. తెలంగాణ మళ్లీ మోసపోయి దోపిడికి గురికాకుండా నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు, కర్షకులు, బహుజన వర్గాలు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు. రాజకీయ వ్యాపార నాయకులను ఒక కంట కనిపెట్టాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు పుల్లూరు సుధాకర్, సోమ రామమూర్తి, చిల్లా రాజేంద్రప్రసాద్, పల్లపు సమ్మయ్య, శానబోయిన అశోక్, కొనతం కృష్ణ, భీనవేని ప్రభాకర్ గౌడ్, రాచకొండ ప్రవీణ్ కుమార్, జంపాల చంద్రశేఖర్, మంద వీరస్వామి, కే.వీరస్వామి, అనుముల రమేష్ పాల్గొన్నారు.