కురవి, మే 30: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ బాధ్యత ప్రజలు, ప్రజాప్రతినిధులే తీసుకోవాలని కురవి మండలం మోద్గులగూడెం పాఠశాలల శాశ్వత అభివృద్ధి దాత వేమిశెట్టి చంద్రయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం మోద్గులగూడెం పాఠశాల ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మన గ్రామంలోని పాఠశాలల అభివృద్ధికి సహకరించుకోవాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదువుకొని పాఠశాలకు, కన్నతల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరారు.
పాఠశాల హెచ్ఎం ఎం. సత్యనారాయణ చారి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం నర్సరీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తుందన్నారు. ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా బీటెక్ విద్యను అందిస్తుందని, ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ తో పాటు మధ్యాహ్న భోజనం, ఉచిత నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు అందిస్తుందని, కంప్యూటర్ విద్య అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు.
వీటితో పాటు అనుభవం కలిగిన టీచర్లు, నాణ్యమైన విద్య అందుతుందని, కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వాటిని బ్రతికించాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్ పర్సన్స్ కొత్త శారద, షేక్ మైబా, గ్రామ పెద్దలు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.