నర్మెట, నవంబర్ 8 : ఒకప్పుడు తీవ్ర దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న జనగామ జిల్లా నర్మెట మండలంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా జలాలే కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చిన వరదకు తోడు వెల్దండ రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌తో వెల్దండ-కేశిరెడ్డిపల్లి రోడ్డుపైకి జలాలు చేరా యి. రోడ్డుపై మూడు అడుగుల మేరకు నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైతులు, వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వాయర్ నిర్మాణ సమయంలో బీటీ రోడ్డు ఎత్తు పెంచలేదు. వెల్దండ-కేశిరెడ్డిపల్లి రోడ్డుపై నీరు తగ్గకపోవడంతో శనివారం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
బచ్చన్నపేట-నర్మెట మండలాలను కలిపే ఈ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నది. రైతులు తమ వ్యవసాయ బావుల వద్దకు నడిచిపోలేక ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు పరిశీలించి రోడ్డు ఎత్తును పెంచాలని, అవసరమైతే వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. గతంలో రిజర్వాయర్‌లో రోడ్డు పక్కన విద్యుత్ వైర్లు తెగిపడి ఐదు పాడి గేదేలు మృత్యువాతపడి రైతులకు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. రిజర్వాయర్ పరిధి దాటి నీరు పట్టా భూముల్లోకి చేరడంతో వేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. దీంతో తమ పంటలు నీటిలో మునిగిపోతున్నాయని వెల్దండకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.